'వెన్నెల' క్రీడా వెలుగులు

ninth class student sri vennela talent in Discus throw and shot put - Sakshi

 తొమ్మిదో తరగతిలోనే డిస్కస్‌ త్రో, షాట్‌పుట్‌లలో ప్రతిభ

రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

ప్రోత్సాహం ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తెస్తానంటున్న విద్యార్థిని

పెద్ద కోచ్‌ల వద్ద తర్ఫీదుకు అడ్డొస్తున్న పేదరికం

మట్టిలో ఉన్నా మాణిక్యం కాంతులీనుతుందంటారు. అలాంటి కోవకు చెందినదే  ఓ చిన్నారి. చదివేది గ్రామీణ పాఠశాలలోనైనా.. క్రీడా పోటీల్లో మాత్రం మిస్సైల్లా దూసుకుపోతోంది. తొమ్మిదో తరగతిలోనే తన ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ప్రశంసలందుకుంటోంది. అయితే నిరుపేద కుటుంభంలో పుట్టిన ఆ బాలిక ప్రతిభను పేదరికం అడ్డుకుంటోంది. ఎవరైనా ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకాలు తెస్తానంటున్న చిన్నారి శ్రీవెన్నెల వివరాలు చదవండి.

 మేదరమెట్ల: క్రీడల్లో వెలుగులు నింపుతున్న శ్రీవెన్నెల ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని తిమ్మనపాలెం గ్రామానికి చెందిన కోటా దేవదాసు, సుజాతల కుమార్తె. ఈ బాలిక గ్రామంలోని ఆరివారి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈఏడాది తొమ్మిదో తరగతి చదువుతోంది. క్రీడల పట్ల వెన్నెల కున్న ఆసక్తి గమనించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు ప్రతిమ ఆ బాలికకు, డిస్కస్‌త్రో. షాట్‌పుట్‌లలో తర్ఫీదునిచ్చారు. ఆ రెండు ఈవెంట్స్‌లో విద్యార్థిని ఇప్పటికే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సా«ధించి, జాతీయ స్థాయికి ఎంపికై అందరి మన్ననలను అందుకుంటోంది.

ఆశయానికి అడ్డోస్తున్న పేదరికం..
శ్రీ వెన్నెల తండ్రి బేల్దారీ పనులు చేస్తుంటాడు. పేద కుటుంబం కావడంతో తమ కుమార్తెను గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదివిస్తున్నారు. తన బిడ్డ డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌ ఈవెంట్లలో జాతీయ స్థాయికి ఎంపికైందని తెలుసుకుని బాలిక తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఆమెకు మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి, తమ పేదరికం అడ్డొస్తుందని, ఎవరైనా దాతలు ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడి పతకాలను అందిస్తానని చెబుతోందంటున్నారు కన్నవారు.

శ్రీవెన్నెల సాధించిన విజయాలు..
2016–17 సంవత్సరం పొదిలిలో నిర్వహించిన డిస్కస్‌ త్రో షాట్‌çపుట్‌ పోటీల్లో మొదటి స్థానం సాధించింది.
2017–18లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో రెండు ఈవెంట్స్‌లో మొదటి స్థానం సాధించింది. విద్యార్థిని ప్రతిభను గమనించిన స్టేట్‌ సెలక్షన్‌ కమిటీ బాలికను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసింది.
పలాసాలో నిర్వహించిన రాష్ట్ర పోటీల్లో పాల్గొని డిస్కస్‌ త్రోలో మొదటి స్థానం, షాట్‌పట్‌లో మూడో స్థానం సాధించింది.

జాతీయ స్థాయికి ఎంపిక..
ఈనెల 18న మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.

ప్రోత్సహిస్తే దేశానికి పతకాలు తెస్తా..
క్రీడల్లో మరింత రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పతకాలను అందించాలని ఉంది. క్రీడలతో పాటు ఉన్నత చదువులు చదుకొని పోలీసు అధికారి కావాలని ఆసక్తిగా ఉంది. పెద్ద కోచ్‌ల వద్ద కోచింగ్‌ ఇప్పించే స్తోమత నా తల్లిదండ్రులకు లేదు. ఎవరైనా ప్రోత్సాహం ఇస్తే మంచి స్థాయిలో నిలిచేందుకు కృషి చేస్తా.               – కోటీ శ్రీ వెన్నెల

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top