మంత్రివర్యా? మార్కులెక్కడ? | Delay in Sammetiv test results | Sakshi
Sakshi News home page

మంత్రివర్యా? మార్కులెక్కడ?

Jan 18 2018 6:18 AM | Updated on Jan 18 2018 6:18 AM

Delay in Sammetiv test results  - Sakshi

ఒంగోలు: సమ్మెటివ్‌ 1 పరీక్షలు ముగిసి నెల రోజులు కావస్తున్నా ఫలితాలపై మాత్రం నేటికీ స్పష్టత లేకుండా ఉంది. పరీక్షలు పూర్తయినా ఫలితాలు ఎప్పుడు వస్తాయో, కచ్చిత సమాధానం ఏమిటో కూడా అర్థంకాని పరిస్థితి విద్యార్థుల్లో నెలకొంది. దానికితోడు సామర్థ్యానికి మించిన ప్రశ్నలు వచ్చాయంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం మాత్రం వాటిపై ప్రాథమిక పరిశీలన కూడా చేయకపోవడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

బెదరగొట్టిన వినూత్నం..
సమ్మెటివ్‌ పరీక్షల నిర్వహణలో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకున్న విద్యాశాఖ దాని నుంచి తప్పించుకునేందుకు ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నపత్రాన్ని తెరపైకి తెచ్చింది. సమయం చాలకపోవడంతో మూడు సమ్మెటివ్‌లకు బదులుగా రెండు సమ్మెటివ్‌లు మాత్రమే అంటూ ఒక పరీక్షను పూర్తిగా రద్దు చేసింది. అయితే ఈ తరహాలో ఫిజిక్స్, గణితం విద్యార్థులకు పట్టపగలే చుక్కలు కనిపించేలా చేశారు. బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్, ఏపీపీఎస్సీ, యూపీఎస్‌సీ తరహాలో ప్రశ్నలు ఇచ్చారని, తద్వారా విద్యార్థుల సామర్థ్యానికి మించి ప్రశ్నలు వచ్చాయనే విమర్శలు వినిపించాయి.

 దీంతో పూర్తిస్థాయి మెరిట్‌ విద్యార్థులు సైతం రాణించలేక బెంబేలెత్తిన పరిస్థితి నెలకొంది. చివరకు ప్రశ్నలకు సంబంధించి తప్పులు కూడా దొర్లాయి. పరీక్ష పూర్తయి దాదాపు నెలకావస్తున్నా ఇంతవరకు కనీసం తొలిసారిగా నిర్వహించిన వినూత్నంపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడం విద్యాశాఖ అధికారుల మొండి వైఖరికి నిదర్శనమనే వాదన వినిపిస్తుంది. వాస్తవానికి పరీక్షలు ముగిసిన తర్వాత వారంరోజుల్లోగా ఉపాధ్యాయులు తాము మూల్యాంకనం చేసిన పత్రాలను విద్యార్థులకు అందజేసి, విద్యార్థులు ఏయే పొరపాట్లు చేశారు, మరో మారు అటువంటి పొరపాట్లు దొర్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాల గురించి క్షుణ్ణంగా వివరించేవారు. కానీ ప్రస్తుతం విద్యాశాఖ అవలంబిస్తున్న చర్యలతో వాటన్నింటికీ ఫుల్‌ స్టాప్‌ పడినట్లయింది. 

మూల్యాంకనం ఎప్పుడో..
మూల్యాంకనానికి సంబంధించి ప్రశ్నపత్రాలను పది రోజుల క్రితమే జిల్లా కేంద్రం నుంచి విజయవాడకు తరలించారు. మూల్యాంకనం జరిగేటప్పడు జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇస్తామని కూడా సూచించారు. కానీ ఇంతవరకు ఎటువంటి పిలుపు లేకపోవడంతో మూల్యాంకనం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మరో వైపు తెలుగు సబ్జెక్టుకు ఒక్కో పేపర్‌కు 40 ప్రశ్నలు ఇచ్చిన అధికారులు, నాన్‌ లాంగ్వేజెస్‌కు ఏకంగా 80 ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో సామర్థ్యానికి మించిన ప్రశ్నలు ఎక్కువగా రావడం, గణనకు ఎక్కువ సమయం కావాల్సి రావడం తదితరాల కారణంగా మధ్యస్థంగా ఉన్న విద్యార్థి సైతం ప్రశ్నపత్రం చూసి హడలిపోయాడు. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు బొటాబొటీ మార్కులతో బడికి వస్తున్న విద్యార్థులు డ్రాపవుట్లుగా మారతురానే భావన వ్యక్తం అవుతుంది.

కోట్లలో ఖర్చు
మరో వైపు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు విద్యాశాఖ చేపట్టిన వింత గొలుపుతున్నాయి. అకడమిక్‌ క్యాలెండర్‌ ఒక రకంగా, పాఠ్యపుస్తకాల్లో విషయ సూచిక మరో రకంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఏ నెలలో ఏయే పాఠ్యాంశాలను బోధించాలో స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎస్‌సీఈఆర్‌టి) విభాగం పరిశీలిస్తుంది. కానీ పాఠ్యపుస్తకాల్లో ఒక రకంగా, అకడమిక్‌ క్యాలెండర్‌ మరో రకంగా ఉంటుండగా.. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటిస్తున్న పలు రకాల కార్యక్రమాలు, విద్యార్థులకు కేటాయిస్తున్న ప్రాజెక్టు రిపోర్టులు తదితరాల వల్ల పాఠాల బోధన కుంటుపడుతుందనేది విద్యావేత్తల వాదన. అయితే ఈ విషయంపై ఉపాధ్యాయులు కక్కలేక, మింగలేక కొట్టుమిట్టాడుతున్నారనే భావన ఆయా వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.

 ఇన్ని రకాల లోపాలు కళ్ల ముందు కనిపిస్తుంటే మరో వైపు కోట్లు ఖర్చు పెట్టి రాజస్థాన్‌లో ప్రశ్నపత్రాల ముద్రణ, విమానాలు, కంటైనర్లలో తరలింపు వంటి వాటిని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం తీవ్రంగా నిరసిస్తున్నాయి. కనీసం ఇప్పటికైనా సమ్మెటివ్‌–1 ప్రశ్నపత్రాలకు సంబంధించి విద్యాశాఖ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాలని, సామర్థ్యానికి మించిన ప్రశ్నల తయారీ గురించి చర్చతోపాటు తప్పుగా గుర్తించిన వాటిపై మార్కులను కలపడం ద్వారా విద్యార్థుల్లో నైతిక స్థైర్యాన్ని కల్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement