బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

ZPTC and MPTC Candidates Life In Ballot Box - Sakshi

చుంచుపల్లి: జిల్లాలో పరిషత్‌ పోరు మూడు విడతల్లో ప్రశాంతంగా ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా ఉంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులుగా అభ్యర్థులు బూత్‌ల వారీగా నమోదైన ఓట్ల ఆధారంగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయని బేరీజు వేసుకుంటున్నారు. మరికొందరు ఏకంగా గెలుపు ధీమాలోనే ఉన్నారు. ఫలితాలు రావడానికి ఇంకా 10 రోజుల సమయం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నారు.

ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత  పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను లెక్కిస్తారు. జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 209 ఎంపీటీసీలకు, 21 జెడ్పీటీసీలకు ఓటింగ్‌ జరగాల్సి ఉండగా, 21 జెడ్పీటీసీ, 206 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

3 ఎంపీటీసీ స్థానాలు.. కోయగూడెం, అశ్వాపురం, ఎల్చిరెడ్డిపల్లి ఏకగ్రీవమయ్యాయి. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు 7 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల యూనిట్‌గా జెడీటీసీ ఓట్లను, గ్రామ యూనిట్‌గా ఎంపీటీసీ ఓట్లను అధికారులు లెక్కిస్తారు. ముందుగా ఎంపీటీసీ ఓట్లను లెక్కించిన తర్వాతనే జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు. జిల్లావ్యాప్తంగా 841 మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాల్లో, 121 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాల్లో, మొత్తం 962 మంది అభ్యర్థులు పరిషత్‌ ఎన్నికల బరిలో ఉన్నారు.

ముందు ఎంపీటీసీ.. తర్వాతే జెడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్‌ 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు మూడు దశల్లో చేపడతారు. మొదటి దశలో బ్యాలెట్‌ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారు. ఇది ఆయా పోలింగ్‌ కేంద్రాల వారీగా జరుగుతుంది. ఆ తర్వాత వాటిని బండిల్‌ చేస్తారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడివిడిగా విడదీసి ఒక్కో బండిల్‌లో 25 బ్యాలెట్‌ పత్రాలు ఉండేలా కట్టలు కడతారు. మొదట ఎంపీటీసీ ఓట్లను తరువాత జెడ్పిటీసీ ఓట్లను లెక్కిస్తారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్‌ మొదలుపెడుతారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు, రెండు రౌండ్లు ఏర్పాటు చేస్తారు.

ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థికి ఇద్దరు చొప్పున కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రతి బ్యాలెట్‌ పేపర్‌ను ఓపెన్‌ చేసి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు అధికారులు చూస్తారు. చెల్లుబాటు అయితే వాటిని ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారు. ఒక వేళ అనుమానాలు వ్యక్తం చేస్తే మాత్రం వాటిని రిటర్నింగ్‌ అధికారుల దగ్గరకు పంపించి, నిర్ణయం తీసుకుంటారు. అభ్యంతరాలున్న బ్యాలెట్ల పేపర్ల విషయంలో రిటర్నింగ్‌ అధికారులదే తుది నిర్ణయం ఉంటుంది. ఒక్కొక్క రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో స్థానానికి అధికారులు రెండు రౌండ్లు ఏర్పాటు చేయనున్నారు.

మొదట పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కించిన తరువాత గ్రామాల వారీగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎంపీటీసీ స్థానానికి ఒక టేబులు ఏర్పాటు చేస్తారు. దీని పరిధిలో బ్యాలెట్‌ పెట్టెలన్నింటినీ ఒకేసారి సీలు తీస్తారు. లెక్కింపునకు ఆరంభంలో పీవో డైరీలో ఉన్న లెక్కకు సమానంగా ఉన్నాయో లేవో సరి చూస్తారు. ఒక్కొక్క ఎంపీటీసీ స్థానం లెక్కింపులో ఒక సూపర్‌వైజర్‌తోపాటు ఇద్దరు ఎన్నికల అధికారులు లెక్కింపులో పాల్గొంటారు. జిల్లాలో మొత్తం 206 ఎంపీటీసీ స్థానాల లెక్కింపులో 618 మంది సిబ్బంది లెక్కింపు విధుల్లో పాల్గొంటారు. వీరికి 10 శాతం అదనంగా సిబ్బంది అందుబాటులో ఉంటుంది.

జిల్లాలో 7 లెక్కింపు కేంద్రాలు 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 7 లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా మండలాల పరిధిలోగల ప్రధాన పట్టణాలలో బ్యాలెట్‌ బాక్సులను అధికారులు భద్రపరిచారు. తొలివిడత ఎన్నికలు జరిగిన 7 మండలాలు అశ్వాపురం, చర్ల, బూర్గంపాడు, దుమ్ముగూడెం సంబంధించిన ఓట్ల లెక్కింపు భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పాల్వంచలోని అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తారు.

రెండో విడతలో ఎన్నికలు జరిగిన అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, జూలూరుపాడు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొత్తగూడెం వేపలగడ్డలోని అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతుంది. ఇక పినపాక, కరకగూడెం, మణుగూరు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కిం పు సమితి సింగారం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు సంబంధించి న ఓట్ల లెక్కింపు అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది.

ఇక చివరి విడతలో ఎన్నిక లు జరిగిన ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇల్లెందులోని టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ కళాశాలలో నిర్వహిస్తారు. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌ మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్‌ కళాశాలలో నిర్వహిస్తారు. అధికారులు ఇప్పటికే ఆయా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే గురువారం జేసీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం ఎన్నికల సిబ్బందితో జరిగింది.

లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నాం  
జిల్లాలో ఈ నెల 27వ తేదీన చేపట్టనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు విషయంలో 7 కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. సిబ్బందికి ఇప్పటికే ఒక దఫా శిక్షణ తరగతులు నిర్వహించాం. మరో రెండు రోజుల్లో మరోదఫా శిక్షణనిచ్చి అవగాహన కల్పిస్తాం. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల నియమావళి అమలుపరుస్తాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తాం. –కర్నాటి వెంకటేశ్వర్లు, జేసీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top