
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటర్ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. ‘ భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, జాతీయ రూపకర్త నెహ్రూ అని, 1940లో స్వాతంత్య్రం వచ్చిందని చెప్పి అజ్ఞానాన్ని బయటపెట్టుకున్న ‘నిత్య కల్యాణం’ ఢిల్లీకి వెళ్లి ఏం మాట్లాడుతున్నాడో. హిందీ, ఇంగ్లీష్ రాకుంటే అక్కడ హోటల్‌లో భోజనం కూడా ఆర్డర్ ఇచ్చుకోలేం’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఇక చంద్రబాబుపై మరో ట్వీట్ చేస్తూ.. ‘బంగారు బాతు’ అమరావతిని చంపేశారని చంద్రబాబు నాయుడు శోకాలు పెడుతున్నదెందుకో ఇప్పుడర్థమైంది. అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ రూ.500 కోట్టు ముట్ట చెప్పిందని ఇన్‌కంటాక్స్ వాళ్లు బయట పెట్టిన తర్వాత లింకులు, బొంకులన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయి’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
‘వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు టీడీపీ జవాబిచ్చే పరిస్థితుల్లో ఉందా? మాలోకం ఏదో అన్నాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు. మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది. చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారు. ఎల్లో మీడియా కూడా షాక్ నుంచి తేరుకోనట్టుంది’ అని మరో ట్విట్‌లో విమర్శించారు.