
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు తీరు అప్రజాస్వామికంగా ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటిస్తూ, మంత్రులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను తక్షణమే బర్తరఫ్ చేయాలని ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయాలని, తమ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను దొడ్డిదారిన టీడీపీ దొంగలించిందన్నారు.
గురువారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో .. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రపై అధికార పార్టీ, విషం కక్కుతున్న ఎల్లో మీడియా తీరును తప్పుబడుతూ, ప్రజలకు వాస్తవాలను వివరించారు. ఫిరాయింపుకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుని, వీటన్నింటిని అమలు చేశాకే తాము అసెంబ్లీలోకి అడుగు పెడుతామంటూ వైఎస్ జగన్ హుందాగా చెప్పడం జరిగిందన్నారు. అయితే ప్రజాకోర్టులో ఎక్కడ తాము దొంగలుగా మిగులుతామేమోనని అధికార పార్టీ ఉన్నఫలంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసిందన్నారు. పైగా అభివృద్దిని అడ్డుకుంటోందని, ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని ప్రతిపక్షంపై అనవసరపు నిందలు మోపుతోందన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి ప్రజాస్వామ‍్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. ప్రజాసంకల్పయాత్రలో జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు సర్కార్ భయపడుతోందన్నారు.
వైఎస్ జగన్ చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రకు ఓ లక్ష్యం ఉందన్నారు. తమకు ప్రజలే దేవుళ్లని, మూడేళ్లుగా అధికార పక్షం ఏవిధంగా ప్రతిపక్షంపై దాడి చేసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందో ప్రజలందరికీ తెలిపేందుకే ఆయన పాదయాత్రను చేపడుతున్నట్టు ఎంపీ వరప్రసాద్ తెలిపారు.