అధికార అక్కసు..!

YSRCP MLA Ravindranath Reddy Fires on TDP Leaders - Sakshi

నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి

ఉద్రిక్తతల నడుమ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు  

సర్వరాయసాగర్‌కు నీరు నిలుపుదల

సాక్షి, ముద్దనూరు(వైఎస్సార్‌): గండికోట జలాల సరఫరాలో రైతుల ప్రయోజనాలను విస్మరించి జిల్లాలోని అధికార పార్టీ నాయకులు జల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ తమకు పేరు రాకుండా పోతుందోనన్న అక్కసుతో అధికారులపై ఒత్తిడి తెచ్చి  సర్వరాయసాగర్‌కు నీటి విడుదల ఆపారు. వారి తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు భగ్గుమన్నారు. వామికొండ వద్ద ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే...  సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి నవంబర్‌ 30వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని గతంలో నిర్ణయించారు. 

అయితే నాల్గవ తేదీలోగా సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేస్తామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో ఆయన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం వామికొండ జలాశయం నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని ఇరిగేషన్‌ అధికారులు విడుదల చేశారు. కృష్ణాజలాలు సర్వరాయసాగర్‌కు వస్తున్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప మేయర్‌ సురేష్‌బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డిలతో కలిసి సోమవారం సాయంత్రం పూజలు చేసేందుకు సర్వరాయసాగర్‌ కాలువ వద్దకు వెళ్లారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పూజలు చేసేందుకు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో టీడీపీ నాయకులు ఇరిగేషన్‌ అధికారులపై ఒత్తిడి చేసి నీటి విడుదలను నిలిపి వేయించారు. విషయం తెలిసి ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, ఇతర నాయకులు పెద్దఎత్తున మండల రైతులతో కలిసి వామికొండ జలాశయం క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్దకు వెళ్లారు. అక్కడ నీరు నిలుపుదల చేశారని తెలియగానే కలెక్టర్‌ బాబూరావునాయుడు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ మధుసూదన్‌రెడ్డిలతో రవీంద్రనాథరెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. 

నీరు ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. పైనుంచి ఉత్తర్వులు అందలేదని, రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు అందగానే నీరు విడుదల చేస్తామని ఎస్‌ఈ తెలిపారు. దీనికి నిరసనగా నేతలందరూ వామికొండ క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. నీరు విడుదల చేసేంతవరకు కదలమని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అధికారులకు తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించారని  తెలియగానే కొండాపురం సీఐ చిన్నపెద్దయ్య, ముద్దనూరు ఎస్‌ఐ నరసింహారెడ్డిలు తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. నిరసనను ఆపాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే నిరాకరించడంతో బలవంతంగా అందరినీ ముద్దనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. 

పెద్దఎత్తున రైతులు పోలీసులకు అడ్డుతగిలారు. ఉద్రిక్తతల మధ్య నాయకులను ముద్దనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, కమలాపురం, వీఎన్‌పల్లె మండలాల కన్వీనర్లు ఉత్తమారెడ్డి, రఘునాథరెడ్డి, నాయకులు సుమిత్ర, రాజశేఖరరెడ్డి, ఎంపీటీసీలు రవి, చండ్రాయుడు, పాలగిరి, అడవిచెర్లోపల్లె, మిట్టపల్లె సర్పంచ్‌లు జంగంరెడ్డి, సాంబశివారెడ్డి, ప్రతాప్‌ నిరసనలో పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top