సూత్రధారి జేసీనే

YSRCP Leaders Slams JC Prabhakar In Anantapur - Sakshi

తాడిపత్రిని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించండి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నర్సింహయ్య  

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమంపై పథకం ప్రకారమే దాడులు జరిగాయని, వీటి వెనుక సూత్రధారి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నర్సింహయ్య ధ్వజమెత్తారు. ఆదివారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ స్వార్థం, ఆధిపత్యం కోసం జేసీ సోదరులు ప్రజలను పావులుగా వాడుకుని బలి చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న పొలమడ, పెద్ద పొలమడ గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.   

ముందస్తు జాగ్రత్తల్లోనూ విఫలం
ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులకు మధ్య గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణమని పైలా పేర్కొన్నారు. దాడులు జరిగిన వెంటనే ఎస్పీ అప్రమత్తం కావడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందన్నారు. ప్రబోధానంద స్వామి ఆశ్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన భక్తులే అధికంగా ఉన్నారన్నారు. ఆశ్రమ నిర్వాహకులను, ఆశ్రమాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ఎమ్మెల్యే జేసీ ప్రయత్నం చేసి, విఫలమైనప్పుడు గ్రామస్తులను అడ్డం పెట్టుకుని గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి
ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై గతంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని పైలా అన్నారు. ఎమ్మెల్యే తాను పెద్ద రౌడీని అని చెబుతూ పోలీసులను, పోలీస్‌ స్టేషన్లపై దాడులను చేస్తుంటారని, ఆయన దారినే అనుచరులూ ఆచరిస్తుంటారని తెలిపారు. ఆయన మితిమీరిన ఆగడాలకు తాడిపత్రి ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ప్రజా విశ్వాసం కోల్పోయి గొడవల ద్వారా భయోత్పాతం కల్పించి సామాన్య ప్రజల జన జీవనానికి భంగం కల్గిస్తున్నారని మండిపడ్డారు. జేసీ సోదరులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.   తక్షణమే తాడిపత్రిని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి, ఐపీఎస్‌ అధికారిని నియమించి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రాజారాం, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, వైఎస్సార్‌సీపీ నాయకులు రామశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top