
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.. వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం బూత్ కమిటీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డితోపాటు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ పాల్గొన్నారు.
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైఎస్సార్‌సీపీ ప్రకటించిన పథకాలను ఆయన కాపీ కొడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు వందల హామీలల్లో ఒక్క హామీ కూడా ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ చేసే కుటిల యత్నాలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.