అతిపెద్ద స్కాం: బాబుపై సీబీఐ విచారణకు ఎందుకు జంకు?

YSRCP Leader Ambati Rambabu Fires on TDP, BjP leaders - Sakshi

బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు

పీడీ అకౌంట్ల విషయంలో బీజేపీ నేతల సంచలన ఆరోపణలు

పరస్పర ఆరోపణలు తప్ప.. చర్యలేవి

వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతిని అంబటి రాంబాబు ఫైర్‌

సాక్షి, విజయవాడ :  ఏపీలో రూ. 53వేల కోట్లు దారిమళ్లాయని, టీడీపీ ప్రభుత్వం ఈ మేరకు సొమ్మును 58 వేల పీడీ అకౌంట్లలోకి మళ్లించి.. దేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన సంచలన ఆరోపణలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. పీడీ ఖాతాలను వేలసంఖ్యలో తెరిచిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదని, ఇతర రాష్ట్రాల్లో వందల సంఖ్యలో మాత్రమే పీడీ అకౌంట్స్‌ ఉన్నాయని, మరి రాష్ట్రంలో ఇన్ని అకౌంట్స్‌ ఎందుకు తెరిచారని ఆయన ప్రశ్నించారు. ఇది చిన్న కుంభకోణం కాదని, 2జీ స్కాం తరహాలో పెద్ద కుంభకోణమని బీజేపీ నేతలే అంటున్నారని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారని, మరి ఎందుకు సీబీఐ విచారణ జరిపేందుకు బీజేపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారని అంబటి సూటిగా ప్రశ్నించారు.  బీజేపీ నేతలు ప్రధానితో చెప్పి చంద్రబాబు ప్రభుత్వంపై విచారణ చేయించడానికి ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

బీజేపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు, అవినీతి ఆరోపణలు చేసుకోవడం తప్ప..ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని  విమర్శించారు. ‘బీజేపీ నేతలు జీవీఎల్‌ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై  పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున పీడీ అకౌంట్స్‌ ఓపెన్‌ చేసి.. రూ. 53వేల కోట్లు దారిమళ్లించారని వారు ఆరోపించారు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపితే.. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం అంటున్నారు. అటు ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు.. బీజేపీ నేతలు కుంభకోణాల్లో ఇరుక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా బీజేపీ నేతలు టీడీపీని.. టీడీపీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారు’ అని అంటటి రాంబాబు తప్పుబట్టారు. రాఫెల్‌ కుంభకోణంపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.

టీడీపీ, బీజేపీ మధ్య లాలూచీ కుస్తీ నడుస్తోందని, బీజేపీతో లాలూచికి చంద్రబాబు అన్ని మార్గాలు తెరిచి ఉంచారని దుయ్యబట్టారు. పీడీ అకౌంట్స్‌ వ్యవహారంలో బీజేపీ నేతలు తక్షణమే విచారణ జరిపించాలని అంబటి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత బీజేపీ నేతలపై ఉందని గుర్తుచేశారు. లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ, టీడీపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. 58వేల 500 వ్యక్తిగత ఖాతాలపై చంద్రబాబు జవాబు చెప్పాల్సిందేనని అంబటి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top