నామినేషన్ల కోలాహలం 

YSRCP candidates Nominations have been filed in many places - Sakshi

చిత్తూరు జిల్లాలో కోలాహలంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ర్యాలీలు

వైఎస్సార్‌ జిల్లాలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రవీంద్రనాథ్‌రెడ్డి, గడికోట, మేడా..

కర్నూల్‌లో బుగ్గన, గంగుల, చెన్నకేశవ సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు

విజయనగరంలో కోలగట్ల, బొత్స అప్పలనర్సయ్య, టీడీపీ తరఫున పూసపాటి అదితి.. 

టీడీపీ ఎంపీ అభ్యర్థులు అశోక్‌గజపతిరాజు, శివప్రసాద్‌ నామినేషన్లు

సాక్షి నెట్‌వర్క్‌ : రాష్ట్రంలో వచ్చేనెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. అసెంబ్లీకి 38 మంది, లోక్‌సభకు 19మంది అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకుగాను 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నలుగురు, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ తరఫున ఒకొక్కరు, స్వతంత్రులు ఐదుగురు ఉన్నారు. రాజంపేట ఎంపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి తరఫున ఆయన తల్లి స్వర్ణలత నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అసెంబ్లీ స్థానాలకొస్తే.. వైఎస్సార్‌సీపీ తరఫున గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానానికి నారాయణస్వామి, పలమనేరుకు వెంకట్‌గౌడ, సత్యవేడుకు ఆదిమూలం, శ్రీకాళహస్తికి బియ్యపు మధుసూదన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. మధుసూదన్‌రెడ్డి భారీ జనసందోహంతో ర్యాలీగా తరలివెళ్లారు. శ్రీకాళహస్తి పట్టణంతోపాటు నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి రూరల్‌ మండలం, రేణిగుంట, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో సినీనటుడు భానుచందర్‌ కూడా పాల్గొన్నారు. చిత్తూరు పార్లమెంట్‌ స్థానానికి టీడీపీ అభ్యర్థి శివప్రసాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్నకు నామినేషన్‌ అందజేశారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్‌ అందజేశారు. 

విజయనగరం జిల్లాలో... 
విజయనగరం జిల్లాలో లోక్‌సభకు రెండు, అసెంబ్లీకి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎంపీ పూసపాటి ఆశోక్‌గజపతిరాజు నామినేషను దాఖలు చేశారు. అసెంబ్లీకి సంబంధించి విజయనగరం నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి, టీడీపీ అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు నామినేషను దాఖలు చేశారు. ఆమె ఇండిపెండెంట్‌గా మరో సెట్‌ నామినేషను కూడా ఇచ్చారు. గజపతినగరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బొత్స అప్పలనరసయ్య నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఇక నరసాపురం ఎంపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున రఘురామకృష్ణంరాజు, రాజమహేంద్రవం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఎం. రూపా రామ్మోహన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు..
ఇక వైఎస్సార్‌ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. కమలాపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, రాయచోటి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కడప, మైదుకూరులో ముగ్గురు స్వతంత్రులతోపాటు  పులివెందులలో మరో రెండు పార్టీల తరఫున ఇద్దరు నామినేషన్లు వేశారు.

కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లాలో బుధవారం అసెంబ్లీ స్థానాలకు 10మంది, ఎంపీ స్థానానికి ఒకరు నామినేషన్లు ఇచ్చారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంగుల బిజేంద్రరెడ్డి, డోన్‌ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మిగనూరు నుంచి కే.చెన్నకేశవరెడ్డి, ఆదోని నుంచి వై. సాయిప్రసాద్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా నామినేషన్‌ వేశారు. టీడీపీ అభ్యర్థుల విషయానికొస్తే.. నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరు చరితరెడ్డి, డోన్‌ నుంచి కేఈ ప్రతాప్, పత్తికొండ నుంచి కేఈ శ్యామ్‌కుమార్‌ నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇక అనంతపురం లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా జేసీ పవన్‌రెడ్డి అందజేశారు.

కోలాహలంగా కొడాలి నాని నామినేషన్‌ 
కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) బుధవారం కోలాహలంగా నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత తల్లి వింధ్యారాణి ఆశీస్సులు తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. ఎడ్లబండిపై కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ర్యాలీలో సుమారు 30వేల మంది పాల్గొనడంతో గుడివాడ పట్టణంలోని రహదారులన్నీ కిక్కిరిశాయి. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, దళిత నేత, ఐఎఫ్‌ఎస్‌ అధికారి కాకొల్లు భస్మాకరరావు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అడపా బాబ్జీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top