
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగిన బీసీల ఆత్మీయ సదస్సులో ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:‘బలహీన వర్గాల సంక్షేమానికి నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే... ఆయన కొడుకుగా నేను రెండడుగులు ముందుకు వేస్తా. అట్టడుగు స్థానంలో ఉండే బీసీ కులాలను చట్ట సభల్లోకి తీసుకెళ్తాను’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడి తరహాలో తప్పుడు హామీలిచ్చి తప్పుకోనని స్పష్టం చేశారు. కత్తెర్లు, ఇస్త్రీపెట్టెలు ఇస్తేనే బీసీలపై ప్రేమ ఉన్నట్టా అని ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని, కులాల కుంపట్లు పెడుతున్నారని ఎండగట్టారు. బీసీ పిల్లలను దగ్గరుండి చదివించి, ఉన్నత ఆశయాలతో ముందుకు తీసుకెళ్తామని జగన్ భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 30వ రోజు శనివారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నెకు సమీపంలో స్థానిక బీసీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో జగన్ వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
బీసీలపై ఆయనకున్న ప్రేమ ఇదీ..
‘‘చంద్రబాబుకు బీసీలపై ఎంత ప్రేమ ఉందో ధర్మవరంలోని చేనేత కార్మికులను అడిగితే తెలుస్తుంది. అక్కడ నేత కార్మికులు 37 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా.. ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్కరూ వారిని పట్టించుకోలేదు. నేను వెళ్లి వాళ్లను పలకరించాను. 30 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం కాదా? రిలే దీక్ష చేస్తున్న మహిళలను ‘అమ్మా.. చేనేత కార్మికులకు చంద్రబాబు ఏ హామీ ఇచ్చారు’ అని అడిగితే.. మగ్గం ముందు కూర్చొని ఫోజు మాత్రం బాగా పెట్టాడు కానీ రుణా లు మాఫీ చేయలేద’ని వారు చెప్పారు. ప్రతి కార్మికుడికి ఇళ్లు కట్టించి, మగ్గం షెడ్ వేయిస్తానన్నాడు. రుణాలన్నీ మాఫీ చేసి లక్షన్నర వడ్డీలేని రుణాలిస్తానన్నాడు.. ఇవన్నీ జరిగాయా.. అని అడిగితే.. అన్నా ఇవన్నీ జరగడం దేవుడెరుగు.. నెలకు రూ. 600 సబ్సిడీ వచ్చేది.. చంద్రబాబు వచ్చిన తర్వాత దానికీ కోత పెట్టాడని వాళ్లు చెప్పారు. నాలుగు కత్తెరలు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి చేతులు దులుపుకోవడమే ఆయనకు బీసీలపై ఉన్న ప్రేమ.
మీ పిల్లలను చదివిస్తాం..
పేద ప్రజల అభ్యున్నతికి వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకేసి నవరత్నాలను ప్రకటించాను. మీ పిల్లలను డాక్టర్లు చేస్తారో.. ఇంజినీర్లను చేస్తారో.. అంతకంటే పెద్ద చదువులే చదివిస్తారో మీ ఇష్టం. ఆ చదువులకయ్యే మొత్తం ఫీజు అంతా నేనే కడతాను. బయట ప్రాంతంలో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాదికి ఖర్చులకు రూ.20 వేలు ఇస్తాను. చదువుల కోసం ఎవరూ అప్పుల పాలు కాకుండా చూస్తా. అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లులకు ఏటా రూ.15 వేలు అందిస్తాం. అమ్మ ఒడి, ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాలే కాకుండా పింఛన్ రూ.2 వేలు చేస్తా. అది కూడా 45 సంవత్సరాలకు కుదిస్తాం. ఆరోగ్యశ్రీ కింద విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. వెయ్యి దాటితే అది ఆరోగ్య శ్రీ కిందికి వర్తింపజేస్తాం. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయించుకునేలా.. అది కూడా ఎక్కడైనా చేయించుకునే అవకాశం కల్పిస్తాం. ఆపరేషన్ తర్వాత డాక్టర్ల సూచ న మేరకు రోగి విశ్రాంతి తీసుకుంటే ఆ సమయం లో కూడా ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా డబ్బులు ఇస్తాం. డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తాం.’’ అని జగన్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్‌ను ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె హర్ష శనివారం గార్లదిన్నె సమీపంలో కలిశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో జగన్‌తో కాసేపు మాట్లాడారు.
ఇదీ నిజమైన ప్రేమ
బీసీలు పేదరికం నుంచి బయటకు రావాలంటే బాబు మాదిరిగా కత్తెరలు, ఇస్త్రీ పెట్టె లు ఇవ్వడం కాదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలా పరిపాలన చేయాలి. ప్రతీ పేద కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్, ఇంజినీర్ కావాలని, అప్పుడే పేదరికం పోతుందని వైఎస్సార్ భావించారు. బీసీ సోదరులకు తాను తోడు గా ఉండి.. నువ్వు చదువుకో నేను ఫీజులు కడతానని చెప్పారు. వైఎస్సార్ హయాంలో చదువుల విప్లవం వచ్చింది. చంద్రబాబు పాలనలో ఫీజు రియింబర్స్‌మెంట్ కింద విద్యార్థులకు ఇచ్చేది రూ.30 వేలు. ఇదేనా బాబుకు బీసీల మీద ఉన్న ప్రేమ. ఆరోగ్యశ్రీ పథకం హైదరాబాద్‌లో వర్తించదట. మంచి ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నప్పుడు మరి ఏ ఆస్పత్రుల్లో చూపించుకోవాలి?’’ అని జగన్ అన్నారు.