ఎన్నికల సమర శంఖం పూరించిన వైఎస్‌ జగన్‌

YS Jagan Speech In Tirupati Samara Shankharavam - Sakshi

సాక్షి, తిరుపతి : కలియుగ దైవం శ్రీనివాసుడి సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక‌్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన  ‘సమర శంఖారావం’ బహిరంగ సభలో ఆయన  మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

‘9 ఏళ్లుగా నా కోసం చాలా కష్టపడ్డారు. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలినట్లే. మీ అందరి బాగోగులు అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటా. రాజకీయంగా, సామజికంగా ఆదుకుంటా. చాలా గర్వంగా చెబుతున్నా మీరందరూ నా కుటుంబసభ్యులే. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఆ పథకాలు అందించడంలో మీ పాత్ర కీలకం. న్యాయానికి, అన్యాయానికి ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతుంది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావాలంటే మీరంతా కీలక బాధ్యత తీసుకోవాలి.

చాలాచోట్ల వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారు. 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఎల్లో మీడియా సాయంతో దొంగ సర్వేలు చేయిస్తున్నారు. చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తుంటారు. వచ్చే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే ఎన్నికలు. విశ్వసనీయత, మోసానికి మధ్య జరిగే ఎన్నికలు.. రానున్న ఎన్నికలు ఆప్యాయతకు, డబ్బుకు మధ్య జరిగే ఎన్నికలు. 2014లో చంద్రబాబు మొదటి సినిమా చూపించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారాన్ని గుర్తు చేసుకోండి. నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు ప్రచారం చేశారు. ఆయనొస్తున్నాడు.. రెండు నెలల్లో అన్నీ అయిపోతాయని చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు.

అక్కాచెల్లెమ్మలు తాకట్టు పెట్టిన బంగారం నెల రోజుల్లోనే ఇంటికొస్తుందని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామన్నారు. పేదవారికి ఇల్లు కట్టిస్తామన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని డైలాగులు కొట్టారు. ప్రత్యేక హోదాను ఐదు కాదు.. పదికాదు... 15 ఏళ్లు తెప్పిస్తామన్నారు. హోదా తెస్తానని డ్రామాలు చేస్తూ...చివరకు ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు నల్లచొక్కా వేసుకున్నారు. ఇక మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి మోసం చేశారు. అలాగే పసుపు​-కుంకుమ పేరుతో నాటకాలు. చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తుంటారు. ఇక ఎల్లో మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు’ అని జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top