మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం : వైఎస్‌ జగన్‌

YS Jagan Meeting With Opinion Makers And Neutral Influencers In YSR District - Sakshi

పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే

2.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తాం

సీపీఎస్‌ రద్దు చేస్తాం

తటస్థులతో వైఎస్‌ జగన్‌

సాక్షి, కడప : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎస్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ గురువారం కడపలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీల పేరుతో జాప్యం చేయమని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెగ్యులరైజ్ చేస్తామని, వ్యవస్థల్లో అవినీతి లేకుండా, పరిపాలనలో పారదర్శక విధానానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. 

ఈ క్రమంలో న్యాయవాది జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ... 2008లో వెయ్యి పోస్టులతో మాత్రమే జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు వేశారని తెలిపారు. పదేళ్లుగా జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఊసే లేదన్నారు. ‘రాష్ట్రంలో 5 లక్షల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కేవలం మొన్న మాత్రమే 240 పోస్టులు చంద్రబాబు వేశారు. ఇది చాలా అన్యాయం. యూనివర్శిటీలో విద్యార్థులకు ఫెలోషిప్‌లు రావడంలేదు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీ లేనందువల్లే రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్య వేళ్లూనుకుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అదే విధంగా ఫీజు బకాయిలు రద్దు చేసి, పీహెచ్‌డీ స్కాలర్స్‌కు రూ.5 వేలు, పీజీ విద్యార్థులకు రూ.3వేలు ఇవ్వాలని కోరుతున్నాన్నారు.

మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం
జగదీశ్వర్‌ రెడ్డి ప్రస్తావించిన అంశాలపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ... ‘జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులే కాదు.. ఐదేళ్లుగా ఏ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మేము అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ మీద పూర్తి డ్రైవ్‌ చేస్తాం. 2.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామన్న అంశంపై లెక్కలు కూడా చూపుతాం. గ్రామ సెక్రటేరియట్‌లలో 10 మంది అదే గ్రామానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇస్తాం. లంచాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలు ఇస్తాం. నవరత్నాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను నేరుగా వీరి ద్వారా డోర్‌ డెలివరీ చేస్తాం. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాం. ఈ విషయంపై మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువస్తాం’ అని హామీ ఇచ్చారు.

సీపీఎస్‌ను రద్దు చేస్తాం
ముఖాముఖిలో భాగంగా చిన్నారెడ్డి అనే రిటైర్డ్‌ విద్యాధికారి ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించారు. ‘2018 నాటి మొదటి డీఏ ఫిబ్రవరిలో ఇచ్చారు. మళ్లీ దీన్ని ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తారంట. దాన్ని కూడా మూడు విడతలుగా చేస్తారంట. ఆరు నెలలకు ఇచ్చే డీఏ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు’ అని వాపోయారు. 2018 లో పీఆర్సీతో పాటు ఐఆర్‌ కూడా ఇవ్వాల్సిందన్నారు. గతంలో వైఎస్సార్‌ 22 శాతం ఇచ్చారని గుర్తుచేశారు. సీపీఎస్‌ను తొలగించాలని కోరారు. పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకువస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రైతులకు ప్రతీ మేలో రూ.12500 ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం అని ప్రశంసించారు.

ఇందుకు స్పందనగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా ఉన్నాను. అనేక సందర్భాల్లో ఈ సమస్యలపై నేను స్పందించాను. సీపీఎస్‌ మీద ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోగా సీపీఎస్‌ను తొలగిస్తాం. చంద్రబాబుకు ఈ విషయంపై చిత్తశుద్ది లేదు. అందుకే కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నాడు. నాన్నగారిని ఇవ్వాల్టికీ ఉద్యోగులు అభిమానిస్తారు. ఆయన పేరు నిలబెట్టేలా నేను ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటాను. ఉద్యోగస్తులు చల్లగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మే మనిషిని నేను’  అని వ్యాఖ్యానించారు.

రైతులకు గుర్తింపు నంబరు ఉండాలి..
మార్కెటింగ్‌ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చైతన్య మహిళా సొసైటీకి చెందిన లక్ష్మి మాట్లాడుతూ... ‘రైతుకు గుర్తింపు నంబరు ఉండాలి. తద్వారా ఏ పంట వేస్తున్నాడు. దిగుబడి ఎంత వస్తోంది అన్న అంశాలు సులభంగా తెలుసుకోవచ్చు. వచ్చే పంటను గ్రేడింగ్‌ చేయాలి. దీనివల్ల చాలావరకు దళారీ వ్యవస్థను నిర్మూలించవచ్చు. రైతులు మోసపోకుండా కూడా చూడవచ్చు’  అని అభిప్రాయపడ్డారు. ప్రతి రైతుకు మద్దతు ధర లభించాలని.. మార్కెటింగ్‌ విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘ మార్కెటింగ్‌ పరంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్రలో అనేకసార్లు ప్రస్తావించాను. దళారుల కారణంగా రైతులు నష్టపోతున్నారు. అదే పంట హెరిటేజ్‌ షాపులోకి వెళ్లే సరికి ధరలు భారీగా ఉంటున్నాయి. పలాస జీడిపప్పే దీనికి ఉదాహరణ. అక్కడి ధరకు, మార్కెట్‌ ధరకు రెట్టింపు తేడా ఉంటోంది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి దళారీ వ్యవస్థను కట్టడి చేయాలి. మన ఖర్మ ఏంటంటే.. మన ముఖ్యమంత్రికి హెరిటేజ్‌ షాపులు ఉన్నాయి. తానే దళారీలకు కెప్టెన్‌ అయ్యాడు. నాన్న హయాంలో రైతులకు మంచి గిట్టుబాటు ధరలు వచ్చాయి. చిత్తూరులో తోతాపురి రైతులకు ఇదే జరుగుతుంది. గల్లా, ఆదికేశవుల కుటుంబాలే.. రైతులనుంచి మామిడిని కొంటున్నాయి. ఇక రైతుకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి? మేం అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ సమీక్షిస్తాం’ అని హామీ ఇచ్చారు.

అవినీతికి తావులేని వ్యవస్థలను తీసుకొస్తాం
ముఖాముఖి కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ సైనికులు ఎలా పనిచేస్తున్నారో మేం కూడా సమాజం కోసం అంతే చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తోంది. కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తప్పకుండా రెగ్యులరైజ్‌ చేయాలని కోర్టులు చెప్తున్నాయి. యనమల రామకృష్ణుడు కమిటీ అంతా ఒక బోగస్‌లా నడుస్తోంది. సేవారంగం, సంక్షేమ పథకాలపై మీరు చాలా దృష్టిపెడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై మీ భవిష్యత్‌ ప్రణాళికలను వెల్లడించాలి’ అని కోరారు.

ఇందుకు స్పందనగా వైఎస్‌ జగన్‌.. ‘ కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై చాలా పాజిటివ్‌గా ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ వారిని రెగ్యులరైజ్‌ చేస్తాం. వారి అర్హత, పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. విద్యుత్, విద్యా రంగాలు.. మరే ఇతర రంగమైనా కావచ్చు ఇవి అమలు చేస్తాం. గ్రామ సెక్రటేరియట్‌ సంక్షేమ పథకం కాదు. విప్తవాత్మక అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామ సెక్రటేరియట్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. పెన్షన్ల నుంచి మరుగు దొడ్ల వరకూ లంచాలు వసూలు చేస్తున్నారు. జన్మభూమి కమిటీల మాఫియా భరించలేని స్థాయికి చేరింది. ఈ వ్యవస్థలు ఇలా ఉంటే.. అభివృద్ధి సాధ్యం కాదు కదా. మనం అధికారంలోకి రాగానే అభివృద్ధి అజెండాలో భాగంగానే అవినీతికి తావులేని వ్యవస్థలను తీసుకొస్తాం’  అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top