పశ్చిమ గోదావరికి చంద్రబాబు చేసిందేంటి?

YS Jagan Dares Chandrababu On West Godavari Development - Sakshi

సాక్షి, నిడదవోలు : ‘తెలుగవారి పౌరుషానికి, ఆడపడుచుల శౌర‍్యానికి ప్రతీకగా నిలిచే రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల నిడదవోలు. ఆమె భర్త వీరభద్రుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. అటువంటి ఈ గడ్డమీద కనిపించేది ఏంటో తెలుసా? అన్యాయం, అక్రమం, అవినీతి, దోపిడి, పక్షపాతం కనిపిస్తున్నాయి. ఇసుక దోపిడి, మట్టి దోపిడి తప్ప ఇక్కడ పాలకులకు ఏమీ పట్టడం లేదు. ఇదే జిల్లా ప్రజలు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు 15 నియోజకవర్గాలు ఇచ్చారు. అటువంటి జిల్లాకు ఆయన చేసిందేమీ లేదు.  ఈ ప్రాంతంలో ఆశ్చర్యం కలిగించే రీతిలో ఇసుక దోపిడీ జరుగుతోంది.’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

184వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శనివారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులోని గణేష్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఎన్నికల్లో జిల్లాలో 15 స్థానాల్లో టీడీపీ గెలిస్తే పశ్చమ గోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిందేంటీ అని వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా కలెక్టర్లు పట్టించుకోవడం లేదని, పోలీసులు దగ్గరుండీ ఇసుక దోపిడీ చేయిస్తున్నారన్నారు. ఇసుకను దోచుకునేందుకు చంద్రబాబు కనిపెట్టిన పథకం ‘ఇసుక ఫ్రీ’  అని, అయితే అది జనాలకు కాదని, టీడీపీ ఎమ్మెల్యేలు వారి బినామీలకు. ఇసుక దోపిడీపై ఆధారాలు ఇచ్చినా చెత్తబుట్టలో వేస్తున్నారు. కలెక్టర్లు, చంద్రబాబు, చినబాబుదాకా అందరికీ లంచాలే.

టీడీపీ నేతలు ఇసుక, మట్టినీ వదలడం లేదు. మట్టి దోపిడీ కోసం చెరువులను కూడా విడిచి పెట్టడం లేదు. మట్టి తవ్వకాలలో రూ.34వేల కోట్ల దోపిడీ జరిగింది. దేవుడిని సైతం వదలకుండా టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. జిల్లాలో కనీసం తాగునీరు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. నిడదవోలులో చంద్రబాబు కనీసం ఆటోనగర్‌ కూడా ఇవ్వలేదు. 30 పడకల ఆస్పత్రిలో సరిపడా డాక్టర్లు, నర్సులు కూడా లేరు. కనీసం ఎక్స్‌రే మిషన్‌ కూడా లేదు. హెరిటేజ్‌లో లాభాల కోసం రైతుల పొట్ట కొడుతున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు లేవు. ధరల్లేక రైతులు అల్లాడుతున్నారు. చంద్రబాబు పాలనలో మద్యం షాపులేని గ్రామం ఉందా?. బాబు పాలనలో ఫోన్‌ కొడితే నేరుగా మద్యం ఇంటికే వస్తుంది.

ఏపీలో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.6 నుంచి రూ.7 వరకూ బాదుతున్నారు. రేషన్‌ షాపులో బియ్యం తప్ప ఏమీ రావడం లేదు. చంద్రబాబు రుణమాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని అక్కాచెల్లెళ్లను మోసం చేశాడు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిలువునా ముంచాడు. ఉద్యోగాలు ఇవ్వకపోతే రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. 48 నెలలుగా ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.96 వేలు బాకీ పడ్డాడు. చంద్రబాబు ఎన్నికల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని చెబుతారు. కేజీ బంగారంతో పాటు బెంజి కారు ఇస్తానని కూడా అంటారు. రూ.3వేలు కాదు... రూ.5 వేలు గుంజండి... చంద్రబాబుకు బుద్ధి చెప్పండి. అబద్ధాలు, మోసాలు చేసేవారిని బంగాళాఖాతంలో కలపండి?’ అని పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top