వారణాసిలో మోదీ వర్సెస్‌ శత్రుఘ్న సిన్హా..?

Varanasi Likely To Witness Blockbuster Poll Battle - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సొంత పార్టీపైనే విమర్శల దాడితో విరుచుకుపడుతున్న సీనియర్‌ బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా సార్వత్రిక ఎన్నికలకు ముందు కాషాయ పార్టీకి గట్టి షాక్‌ ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీని బాహాటంగా పలు సందర్భాల్లో విమర్శించిన శత్రుఘ్న సిన్హా రానున్న ఎన్నికల్లో ఆయనపైనే పోటీకి దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వైదొలగితే సమాజ్‌ వాదీ పార్టీ నాయకత్వం సిన్హాను ప్రధాని మోదీపై వారణాసి నుంచి బరిలోకి దింపేందుకు యోచిస్తోందని తెలుస్తోంది. వారణాసిలో ప్రధాని మోదీకి ప్రజాదరణపై ఎలాంటి సందేహాలు లేకున్నా ఓటర్లకు చిరపరిచితుడు కావడంతో పాటు వారణాసిలోని కాయస్థ వర్గంలో గట్టి మద్దతు కలిగిన శత్రుఘ్న సిన్హా పోటీని తోసిపుచ్చలేమని చెబుతున్నారు.

గుజరాత్‌లో ఇటీవల యూపీ, బిహార్‌ వలస కార్మికులు భయంతో స్వస్థలాలకు తిరిగివస్తున్న ఉదంతం వారణాసిలో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేయనుంది. మరోవైపు లక్నోలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శత్రుఘ్న సిన్హా ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో వేదికను పంచుకున్నారు. ఇదే వేదిక నుంచి మోదీ సర్కార్‌పై సిన్హా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

రాఫెల్‌ యుద్ధవిమానాల తయారీకి దసాల్ట్‌ ఏవియేషన్‌ భాగస్వామిగా ప్రభుత్వ రంగ హిందుస్ధాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ను పక్కనపెట్టి ప్రయివేటు సంస్థను ఎందుకు ఎంచుకున్నారని ఆయన నిలదీశారు. రాఫెల్‌ డీల్‌పై ప్రభుత్వం నుంచి ప్రజలు సమాధానం కోరుతున్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top