సీఎం జగన్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నా: వంశీ

Vallabhaneni Vamsi Support CM jagan Decision On English Medium In Schools - Sakshi

సాక్షి, గన్నవరం: తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోతుందని..చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష నేత పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారని  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. టీడీపీ తన తీరు మార్చుకోకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. ఆయన గురువారం​ గన్నవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నలభై అయిదు సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం అయిదారు నెలలు కూడా అధికారం లేకుండా ఆగలేకపోతున్నారు. ఎంతో అపార అనుభవం కల మీరు కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా ఇప్పుడు సమర్ధవంతంగా పోషించలేకపోతున్నారు.  ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రోత్సహించాలి.  ప్రజాతీర్పును గౌరవించాలే కానీ, దాన్ని అపహాస్యం చేయకూడదని అన్నారు.

త్వరలోనే వైఎస్సార్‌ సీపీలో చేరతా..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కలిసి నడుస్తానని  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.  తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, తన కోరిక సఫలం అవడం కోసం ముఖ్యమంత్రిని కలిసిన మాట వాస్తవమేనని అన్నారు. అందరికీ మంచి చేయాలనే సీఎం జగన్‌కు మద్దతు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. త‍్వరలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేసేవారు నారా లోకేష్‌ను ఎందుకు సీఎంను చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. పదవులు ముఖ్యం కాదని, ప్రజల్లో ఉండటమే ముఖ్యమన్నారు.

అప్పుడే ధర్నాలు, దీక్షలా?
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ...‘కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. అప్పుడే ధర్నాలు, దీక్షలు చేయడమేంటి?. డబ్బున్నవారి పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు. మీ పిల్లలు, నా పిల్లలు, డబ్బున్నవారందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నాం. మరి ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆర్ధికశక్తి లేనివారి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా? ప్రభుత్వం ఉచితంగా చదివిస్తానంటే మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోం అని చెబుతున్నారా? లేక తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇంగ్లీష్ అవసరం లేదని మీకు చెబుతున్నారా?. తెలుగును కాపాడే ధర్మం, బాధ్యత మనమీద లేదా? పేదవాళ్ళు ఒక్కరిమీదే ఉందా? నీతులు చెప్పడానికేనా? ఆచరించడానికి కాదా? మన పిల్లలకు ఒక న్యాయం, పేదపిల్లలకు మరో న్యాయమా?

చదవండి: టీడీపీకి వంశీ ఝలక్‌ 

23 సీట్లతో సరిపెట్టారు..
2004 ఎన్నికలకు ముందు మీరు కోటి వరాలు ప్రకటించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని 47 సీట్లకు పరిమితం చేశారు. 2009 లో రాష్ట్రం మొత్తం ఏటీఎం కార్డులు ఇచ్చారు. ప్రజలు సుమారు 90 స్థానాలకే పరిమితం చేసి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 2019 లో కోటిమందికి పసుపుకుంకుమ ఇచ్చారు. వాళ్ళు మనను హాయిగా విశ్రాంతి తీసుకోమని దిండు దుప్పటి ఇచ్చి 23 సీట్లతో సరిపెట్టారు. దీన్నిబట్టి ప్రజల్లో మనం విశ్వసనీయత కోల్పోయిన మాట యదార్ధమా? కాదా?. 2014 ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఎన్నికల వాగ్ధానంగా ప్రకటించాం. 

మన చేతిలో ఉన్న ఈ పనులని ఎప్పుడు ఎలా ఎంతకాలంలో అమలు చేశామన్నది బుర్ర, బుద్ధి, ఇంగితజ్నానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మన చేతిలో లేని ప్రకృతి మీద ఆధారపడ్డ ఇసుక లభ్యతని, కొరతని రాజకీయం చేయడం సమంజసమా?.అకాల వర్షాలు, అతివృష్టి, వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా నదులు, కాలువలు నిండి ఇసుకను వెలికితీసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టే శక్తిని ఆ సెల్‌ఫోన్, కంప్యూటర్‌ని కనిపెట్టినట్లుగానే ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని నేను ప్రార్ధిస్తున్నాను.

ఆర్టీసీ సమ్మెపై మాట్లాడరే?
తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో మీరు, మీ కుమారుడు ఎందుకు పాల్గొనడంలేదు? కారణం ఓటుకు నోటు కేసు కాదా?,ఆంధ్రప్రదేశ్ లో ఇసుక గురించి ఇంత దీక్ష అవసరమా? ఈ ప్రభుత్వానికి పురిటి వాసన అయినా పోయిందా? ఆ రాష్ట్రంలో ఒక ధర్మం, ఈ రాష్ట్రంలో మరో ధర్మమా?. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ టీడీపీ పరిస్థితి మారుతుంది. ఇటీవల జరిగిన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో టీడీపీకి కనీసం రెండువేల ఓట్లు కూడా రాలేదు. వర్థంతికి, జయంతికి తేడా తెలియనివారు పార్టీని లీడ్‌ చేస్తున్నారు. ప్రాణం పెట్టి ఎన్నికల ప్రచారం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎందుకు పక్కన పెట్టారు. 

ఈనాటి ఇసుక దీక్ష కూడా ఆనాటి ధర్మపోరాట దీక్ష బాటలోనే ఉందా? లేదా?. పార్టీ నాశనం అయిపోతుంది. బీజేపీతో ఘర్షణ వద్దని సుజనా చౌదరి, అనేకమంది ప్రముఖులు చెబితే వారి మాటలను పెడచెవిన పెట్టి భజనపరులు చెప్పిన మాయమాటలను చెవికెక్కించుకుని ధర్మపోరాట దీక్షలు చేయడమే తెలుగుదేశం పార్టీ ఈనాటి దుస్థితికి కారణం కాదా? మంచి మాటలు చెప్పినవారందరు పార్టీకి గుడ్‌బై చెప్తే మాయమాటలు చెప్పినవారు చెవిలో జోరీగల్లా హల్‌ఛల్ చేస్తున్నారు.

ప్రజాతీర్పును అపహాస్యం చేయకూడదు
2019 ఎన్నికలలో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. మనకు ఇష్టంలేదని ఇప్పటికిప్పుడు అధికార పార్టీని దించగలమా. ప్రభుత్వం చేసే మంచిని మంచిగాను, చెడును చెడుగాను చూడాలి. మంచిని కూడా గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్లు మీరు వ్యతిరేకిస్తే మీ వెనక మేము దూడల్లాగా అనుసరిస్తే పార్టీ, మనం ప్రజల్లో అభాసుపాలు కామా? ప్రభుత్వం చేసే మంచిని ఎందుకు మంచిగా అంగీకరించలేము? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం సబబా? ఇదే విధంగా నడక సాగిస్తే ప్రతిపక్ష హోదా కూడా పోయి తెలంగాణాలో టీడీపీకి వచ్చిన పరిస్థితి ఇక్కడ కూడా దాపురించదా? అందుకే తప్పులు సరిదిద్దుకుని ప్రభుత్వం చేసే మంచి పనులకు గుడ్డిగా వ్యతిరేకించకుండా మద్దతు పలుకుదాం. లేకుంటే మీరు, మీ పుత్రరత్నం, మీ సలహాదారులు ముంచేసే ఈ టీడీపీ పడవను సాక్షాత్తు ధర్మాడి సత్యం కూడా వెలికితీయలేరు.

ఎన్నికల తర్వాత ఏమయ్యారు..
ప్రతి ఎన్నికలకు ముందు ఒక కొత్త పొత్తు, ఎన్నికల తర్వాత పూర్తిగా వేరొక తంతు?. 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్ 2014 ఎన్నికలలో మద్దతు పలికిన పవన్‌కల్యాణ్ ఆయా ఎన్నికల తర్వాత ఏమయ్యారు? ఇది వాడుకుని వదిలేయడం కాదా?. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ...బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసి రావచ్చా? ఆయన చేస్తే సంసారం... మిగిలినవారు చేస్తే వ్యభిచారమా?. పేపర్‌లో ఎన్నిసార్లు వ్యతిరేకంగా వార్తలు రాయలేదు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకోవాలా?. బ్లాక్‌మెయిల్‌ చేసి పార్టీలో ఉంచాలని చూస్తున్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్ధతిస్తే నాకు వ్యక్తి గతంగా ఎటువంటి లాభం లేదు. పేద ప్రజలకు మాత్రం మంచి జరుగుతుంది, మంచి చేయగలుగుతాను. నియోజకవర్గ అభివృద్ధి, పేదవాడికి చేసే సహాయం మాత్రమే నాకు జరిగే లాభం. పేద ప్రజల మంచికి, నియోజకవర్గ అభివృద్ధికి నా శాసనసభ్యత్వమే అడ్డు అనుకుంటే అందుకోసం రాజీనామా చేసైనా వారికి సేవకుడిగా మిగులుతా.’  అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top