
గన్నవరం: ఇంకా పురిటి వాసన కూడా పోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దీక్షలు, ధర్నాల పేరిట బురద జల్లే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మండిపడ్డారు. కనీసం ఐదు నెలలు అధికారం లేకుండా చంద్రబాబు ఉండలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పేద ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియనివారు టీడీపీని నడపడం సిగ్గుచేటని వంశీ విమర్శించారు. స్థానిక దావాజిగూడెం రోడ్డులోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు.
వరదల్లో ఇసుక తీసే టెక్నాలజీ కనిపెట్టండి బాబు గారు!
‘వరదలు, అకాల వర్షాలు, ప్రకృతి వైపరిత్యాల సమయంలో నదుల నుంచి ఇసుక తీసే టెక్నాలజీ దేశంలో ఎక్కడ లేదు. అయినా ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షలు, ధర్నాలు చేయడం సిగ్గుచేటు. సెల్‌ఫోన్ నేనే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు వరదల్లో ఇసుక తీసే టెక్నాలజీని తీసుకువస్తే మంచిది’ అని వంశీ సలహానిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలనే సీఎం జగన్ నిర్ణయాన్ని తాను పూర్తిగా సమరి్ధస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఇంగ్లిష్ మీడియం చదివితే తప్పులేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదలు చదివితే ఆయనకు అంత బాధ ఎందుకని ప్రశ్నించారు.
2009 తర్వాతి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఏమయ్యారు?
ఇకపై తన రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్‌తోనని, వైఎస్సార్‌సీపీలో చేరే విషయంపై త్వరలో స్పష్టత ఇస్తానని వంశీ తెలిపారు. 2009 ఎన్నికల్లో తన కెరీర్‌ను ఫణంగా పెట్టి టీడీపీకి ప్రచారం చేసిన జూనియర్ ఎనీ్టఆర్ ఆ తర్వాత పారీ్టలో ఎందుకు కనిపించడం లేదని ప్రశి్నంచారు. తెలంగాణాలో ఆర్టీసీ ఉద్యమం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు.
‘మీ పుత్రరత్నం, మీ సలహాదారులు ముంచేసే టీడీపీ పడవను ధర్మాడి సత్యం కూడా బయటికి తీయలేడు.వర్ధంతికి, జయంతికి తేడా తెలియనివారు టీడీపీని నడుపుతుండడం సిగ్గుచేటు’ అని విమర్శించారు. నియోజకవర్గంలోని ఇళ్లులేని పేదలకు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయడం, ప్రజలకు మంచి చేయడమే తన ముందున్న లక్ష్యాలుగా పేర్కొన్నారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్లు పొట్లూరి బసవరావు, కొమ్మా కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ పట్రా కవిత, టీడీపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి అనగాని రవి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.