
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని కోవిడ్ వైరస్‌తో పోల్చడం సీఎం కేసీఆర్ కుసంస్కారానికి నిదర్శనమని, అసలు కరోనా కేసీఆరేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమ ర్శించారు. అసెంబ్లీలో కోవిడ్ వైరస్‌పై జరిగిన చర్చ సందర్భంగా సీఎం సంయ మనం కోల్పోయి మాట్లాడారని, కాం గ్రెస్ ఇచ్చిన రాష్ట్రానికి సీఎంగా ఉండి కాంగ్రెస్ పార్టీనే దూషించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాడంటేనే కాంగ్రెస్ పార్టీ పుణ్యమని, ఆ విషయాన్ని మర్చిపోయి కేసీఆర్ చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పారాసిటమాల్ వేసుకోవాలని కోవిడ్ గురించి మాట్లాడిన సీఎం కేసీఆర్‌కు ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పారాసిటమాల్ వేసుకుంటే తగ్గే వైరస్ అయితే ఇప్పుడు పాఠశాలలన్నీ ఎందుకు మూసేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అసెంబ్లీ రికార్డుల నుంచి ఆ మాటలను తొలగించాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, బడుగు, బలహీన వర్గాలకు అభివృద్ధి పథం చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కన్నతల్లి లాంటిదని, అలాంటి పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.