మోదీకి కేసీఆర్‌ చెంచాగిరీ

Uttamkumar Reddy comments on CM KCR - Sakshi

మీడియాతో ఇష్టాగోష్టిలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అడ్రస్‌ లేకుండాపోతుంది 

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెంచాగిరీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడంతోనే ఆ రెండు పార్టీల మధ్య చీకటి పొత్తులు మరోసారి బయటపడ్డాయని ఆరోపించారు. కేంద్రంపై పోరాడుతున్నామని చెప్పిన టీఆర్‌ఎస్‌ రంగు తేటతెల్లమయిందని వ్యాఖ్యానించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన కేసీఆర్‌ తన స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న హైకోర్టు విభజన, ఎయిమ్స్, ఐఐఎం, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌లను సాధించేందుకు టీఆర్‌ఎస్‌ ఎందుకు పోరాడట్లేదని ఆయన ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రంతో తగవు పడకుండా బీజేపీతో కేసీఆర్‌ లాలూచీ పడుతున్నారని విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అడ్రస్‌ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. 

ప్రతి నెలా రాష్ట్రానికి రాహుల్‌ 
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతినెలా రాష్ట్రానికి వస్తారని ఉత్తమ్‌ చెప్పారు. ఈనెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర పర్యటనలో ఆయన అన్ని వర్గాలతో మమేకమవుతారని వెల్లడించారు. ఈసారి పర్యటనలో కాంగ్రెస్‌ కేడర్‌తో పాటు మహిళలు, సెటిలర్లు, ఎడిటర్లు, యువపారిశ్రామికవేత్తలు, ముస్లిం మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారని వివరించారు. ఈనెల 13న కర్ణాటకలోని బీదర్‌లో జరిగే ఒక సభలో పాల్గొన్న అనంతరం ఆయన హైదరాబాద్‌కు వస్తారని చెప్పారు. శంషాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ ప్రజా చైనత్య యాత్ర బస్సులో రాజేంద్రనగర్‌కు వెళతారని, అక్కడ దాదాపు 15 వేల మంది మహిళలతో సమావేశమవుతారని చెప్పారు. రాజేంద్రనగర్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో జరిగే  సమావేశంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారని, మహిళా బిల్లును బీజేపీ ఎలా అడ్డుకుంటోందో వివరిస్తారని చెప్పారు.  

14న పార్టీ కేడర్‌తో.. 
రాష్ట్రంలో కేసీఆర్‌ అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలు, కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకపోవడం లాంటి అంశాలపై మాట్లాడతారని చెప్పారు. అనంతరం శేరిలింగంపల్లిలో సెటిలర్లతో సమావేశమై బేగంపేటలోని హరిత ప్లాజాలో రాత్రి బసచేస్తారని చెప్పారు. ఈ నెల 14న రాష్ట్రంలో దాదాపు 38 వేల మంది బూత్‌ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ, డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్‌ బేరర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారని వెల్లడించారు. ఆ తర్వాత తెలంగాణలోని ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలకు చెందిన ఎడిటర్లతో సమావేశమవుతారని, తాజ్‌కృష్ణాలో యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. పూర్తిస్థాయి షెడ్యూల్‌ కోసం టీపీసీసీ నేతలందరితో మాట్లాడుతున్నానని చెప్పారు.

ఘనంగా యువజన కాంగ్రెస్‌ దినోత్సవం 
యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని గాంధీభవన్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి యువజన కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించి.. యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.  

‘క్విట్‌ టీఆర్‌ఎస్‌’ లక్ష్యంగా పనిచేయండి 
రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్‌ను తరిమేయాలని, క్విట్‌ టీఆర్‌ఎస్‌ లక్ష్యంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు పనిచేయాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చా రు. ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ దయవల్ల, కాంగ్రెస్‌ కృషి వల్ల సాధించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని రాష్ట్రంలో పర్యటించకుండా ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని ఆరోపించారు. క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో సేవాదళ్‌ ఆధ్వర్యంలో క్రాంతి దివస్‌ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉత్తమ్‌ మాట్లాడారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top