బడ్జెట్‌లో తెలంగాణకు దక్కని కేటాయింపులు!

Union Budget 2020 : Telangana MPs Upset With Budget - Sakshi

బడ్జెట్‌పై టీఆర్‌ఎస్‌ ఎంపీల అసంతృప్తి

కాళేశ్వరానికి దక్కని జాతీయ హోదా

బయ్యారం ఊసేలేని కేంద్ర బడ్జెట్‌

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవని ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించకపోగా.. కనీసం విభజన హామీలను సైతం నెరవేర్చలేదని పెదవి విరిశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు కేంద్రానికి విజ‍్క్షప్తి చేసిన విషయం తెలిసిందే. దాదాపు లక్ష కోట్లతో నిర్మించిన ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. కానీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగంలో దాని ప్రస్తావనే లేదు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు తీవ్ర నిరాశ చెందారు. (బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం)

గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇచ్చిన హామీని విస్మరిస్తూ.. రెండు బడ్జెట్‌ సమావేశాలు ముగిసినా.. కేంద్రం నుంచి ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నా.. ముందడుగు మాత్రం పడలేదు. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్‌ నేతలు కోరుతున్నారు. అలాగే మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినప్పటికీ.. కేంద్రం విడుదల చేయడంలేదని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, తమపై ఇంత వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ఏపీకి అందని సీతమ్మ వరాలు..)

అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌ సమావేశాల్లో పలు అంశాలను కేంద్రానికి ప్రతిపాదిస్తోంది. వాటిలో కాజీపేట్‌ రైల్వే వ్యాగన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నిజామాబాద్‌ పసుపు బోర్డుతో పాటు కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి అంశాలను ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. గత బడ్జెట్‌లో వీటికి మొండిచేయి చూపడంతో.. ఈ సారైనా కేంద్ర కరునిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ విత్తమంత్రి ప్రసంగంలో మాత్రం వాటి ప్రస్తవన లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర నుంచి నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్‌ ఇ‍ప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు పెద్దగా లేకపోవడంతో.. తెలుగు ప్రజలు పూర్తి నిరాశలో ఉన్నారు. (కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top