హస్తానికి గులాబీ దెబ్బ | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 21 2018 1:49 AM

Two Congress MLCs Joined In TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్‌ కుమార్‌ గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆకుల లలిత ఆర్మూర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆకుల లలిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఆమె ఎన్నికయ్యారు.

గతంలో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా డిచ్‌పల్లి నుంచి ఎన్నికయ్యారు. ఆకుల లలిత టీఆర్‌ఎస్‌లో చేరడం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో హస్తం పార్టీకి బలమైనదెబ్బని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు టి. సంతోష్‌ కుమార్‌ 2013లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 40 మంది సభ్యులుగల శాసన మండలిలో ప్రస్తుతం షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగిలారు. వారిద్దరి పదవీకాలం మార్చి ఆఖరుతో ముగియనుంది. వారి పదవీకాలం ముగిశాక మండలిలో కాంగ్రెస్‌ కు ప్రాతినిధ్యం లేకుండాపోయే పరిస్థితి నెలకొంది. 

అదేబాటలో ఎమ్మెల్యేలు..! 
ఆకుల లలిత, టి. సంతోష్‌ కుమార్‌ బాటలోనే మరికొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ తొలి సమావేశానికి ముందే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వస్తారని పేర్కొంటున్నాయి. 

Advertisement
Advertisement