టీడీపీ మరో వికెట్‌ డౌన్‌ : రేవంత్‌ వెంటే సీతక్క

TTD senior Seethakka to join Congress along with Revanth

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి సీతక్క ఊహించిన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సంసిద్ధులయ్యారు. పార్టీ పదవులు, సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు సీతక్క లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఫ్యాక్స్‌లో లేఖను బాబుకు పంపారు. అనంతరం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

నేటి సాయంత్రం రాహుల్‌ సమక్షంలో : పలువురు టీడీపీ జిల్లా అధ్యక్షలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరతారు. మంగళవారం ఉదయం హుటాహుటిన బయలుదేరిన సీతక్క.. రేవంత్‌ బృందంతో కలుసుకునే అవకాశంఉంది. 

ఇంకొందరు ప్రముఖులు! : గిరిజన వర్గానికి చెందిన సీతక్క(ధనసరి అనసూయ) ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీడీపీకి ముఖ్యనాయకురాలిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఓడినా, పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. తనతోపాటే ఎదిగిన ఎర్రబెల్లి లాంటి నేతలు సైతం గుడ్‌బై చెప్పి వెళ్లినా ఆమె మాత్రం నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. అయితే, తెలంగాణలో టీడీపీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబోతున్నారన్న వార్తల నడుమ ఆమె ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోక తప్పని పరిస్థితి. ఇంకొందరు ప్రముఖులు కూడా తమతమ దారులు వెతుక్కునే పనిలో ఉన్నట్లు తెలిసింది.

జాబితో సీతక్క పేరు లేకున్నా..: రేవంత్‌ తిరుగుబావుటా అనంతరం అతని వెంట వెళ్లే నాయకుల జాబితాలో సీతక్క పేరు ప్రధానంగా వినిపించింది. కానీ రాహుల్‌ గాంధీకి రేవంత్‌ ఇచ్చినట్లుగా పేర్కొంటున్న జాబితాలో సీతక్క పేరులేకపోవడం గమనార్హం. 2014లో ములుగు నియోజకవర్గం నుంచి పోటీచేసిన సీతక్క.. అజ్మీరా చందూలాల్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత పర్యాటక మంత్రి చందూలాల్‌ కూడా ఒకప్పటి టీడీపీ నేతే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top