‘కారు’ దిగుతున్న గులాబీ నేతలు

TRS suspends MLC Yadava Reddy - Sakshi

మరో ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై టీఆర్‌ఎస్‌ వేటు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల తరుణంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు అమలు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లోని పలువురు కీలక ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి దూరమవుతున్నారు. మరికొందరిపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం స్వయంగా వేటు వేస్తోంది. కారణాలు ఏమైనా అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్‌ఎస్‌కు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఎన్నికలు ముగిసేలోపు ఇంకెంత మంది ఈ జాబితాలో ఉంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ నెల 20న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేలోపే మరికొందరు కీలక ప్రజాప్రతినిధులపై ఇదే తరహా నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్‌ ముఖ్యలు ప్రకటిస్తున్నారు.

అసంతృప్తితో ఒక్కొక్కరు..
టీఆర్‌ఎస్‌ వ్యవహారాలకు కొన్ని నెలలుగా దూరంగా ఉంటూ వచ్చిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కొన్ని రోజుల క్రితం రాహుల్‌ని, ఆ తర్వాత సోనియాగాంధీని కలిశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్‌ అధికారికంగా ప్రకటించకపోయినా టీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. అసెంబ్లీ రద్దయిన వెంటనే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ పార్టీ నుంచి పోటీ చేసే 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు ఆర్‌.భూపతిరెడ్డి, రాములునాయక్, కొండా మురళీధర్‌రావు టీఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తాజా మాజీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, బాబుమోహన్, బొడిగె శోభ, బి.సంజీవరావు టీఆర్‌ఎస్‌ను వీడారు. వీరిలో కొండా సురేఖ, సంజీవరావు కాంగ్రెస్‌లో చేరారు. బాబుమోహన్, శోభ బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీకి దిగారు. మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌గౌడ్, ఎన్‌.బాలునాయక్, రమేశ్‌రాథోడ్, కేఎస్‌ రత్నం సైతం టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.  

యాదవరెడ్డిపై వేటు..
ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ అధిష్టానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top