టీఆర్‌ఎస్‌కే అనుకూలం: తమ్మినేని

TRS Positive Results on this elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్టు భావిస్తున్నామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. టీఆర్‌ఎస్‌కు మేజిక్‌ఫిగర్‌ కంటే తక్కువ వస్తే బీజేపీ, ఎంఐఎం మద్దతిచ్చే అవకాశాలున్నాయన్నారు. ఉత్తర తెలంగాణలో ఓటింగ్‌ పెరిగిన ప్రభావం కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలించవచ్చని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. మొదట్లో టీఆర్‌ఎస్‌–ప్రజాకూటమి మధ్య హోరాహోరీ పోరు సాగినా, చివరకు టీఆర్‌ఎస్‌ పట్ల సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయన్నారు. వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో ఫలితాలు మిశ్రమంగా వచ్చాయన్నారు.

ఈ ఎన్నికలపై డబ్బు ప్రభావం తీవ్రస్థాయిలో ఉందని, దానిని అరికట్టడంలో లేదా నియంత్రించడంలో ఈసీ, పోలీసువర్గాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్నారు. సీపీఎం–బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) 107 స్థానాల్లో పోటీచేయడం ద్వారా ప్రత్యామ్నాయ విధానాలు, సామాజికన్యాయం–సమగ్రాభివృద్ధిని ప్రజల్లో చర్చనీయాంశం చేయగలిగామన్నారు. సీపీఎంగా పోటీచేసిన 26 సీట్లలో కనీసం ఒకటి, రెండుస్థానాల్లో, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు బరిలో నిలిచిన 81 సీట్లలో రెండు, మూడు చోట్ల విజయావకాశాలున్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. సీపీఎం–బీఎల్‌ఎఫ్‌ పోటీచేసిన కొన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో తమ ఫ్రంట్‌కు ఓట్లు పడే అవకాశాలున్నాయన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top