టీఆర్‌ఎస్‌.. పోస్టుమార్టం!

TRS Leaders Unhappy Happy Lok Sabha Elections Results - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌ శిబిరం ఆలోచనల్లో పడింది. కేవలం ఆరు నెలల కిందటి ఆదరణ ఎలా తలకిందులైంది..? గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల నాటి ఓట్ల సునామీ.. ఇప్పుడెందుకు దూరమైంది..? నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి తప్పుటడుగు ఎక్కడ పడింది..? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఉందని సమాచారం. కచ్చితంగా గెలిచి తీరుతామని భావించిన నల్లగొండ రెండోసారీ నిరాశ పరచడం, సిట్టింగ్‌ స్థానమైన భువనగిరిని తిరిగి నిలబెట్టుకోలేక పోవడానికి గల కారణాలను అన్వేషిస్తోందని అంటున్నారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మొత్తంగా 5,00,346 ఓట్లు సాధించారు. కానీ, డిసెంబర్‌ నాటి ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని దేవరకొండ, నాగార్జు సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులకు 6లక్షల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఓటమి పాలైన హుజూర్‌నగర్‌ ఓట్లూ ఉన్నాయి. అంటే కేవలం ఆరు నెలల తేడాతో ఆ పార్టీ ఏకంగా లక్ష పైచిలుకు ఓట్లను కోల్పోయింది. ఈ కారణంగానే నల్లగొండ ఎంపీ స్థానం దక్కకుండా పోయిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

వ్యూహాత్మకంగా పనిచేసినా..!
వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎక్కడా అలసత్వం ప్రదర్శించినట్లు కనించలేదు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని వెంట తీసుకుని ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేశారు. ఒక విధంగా కాంగ్రెస్‌ అభ్యర్థి చేసిన ప్రచారం కంటే.. అధికార టీఆర్‌ఎస్‌ చేసిన ప్రచారమే ఎక్కువ. ఒకసారి పార్టీ అధినేత కేసీఆర్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేసి వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు సైతం అభ్యర్థిత్వం ఖరారుకు ముందు ఒకసారి, చివరలో ఒకసారి నల్లగొండకు ప్రచారానికి వచ్చి బహిరంగసభలో, రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలూ ఎవరికి వారూ మండలాలు, గ్రామాలను చుట్టి వచ్చారు. ఇంత చేసినా టీఆర్‌ఎస్‌ గెలుపు వాకిట బొక్కబోర్ల పడడాన్ని ఆ పార్టీ నాయకత్వం సీరియస్‌గానే పరిగణిస్తోందని చెబుతున్నారు.

అతివిశ్వాసం కొంపముంచిందా..?
అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు నెలలకే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ నాటి ఫలితమే రిపీట్‌ అవుతుందన్న అతివిశ్వాసమే దెబ్బకొట్టిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలు అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లలేక పోయారా..? అదే పార్టీ కొంప ముంచిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏడింట ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు ఉన్నా.. చివరకు తమకు వచ్చిన మెజారిటీలో సగం ఓట్లు కూడా సాధించలేక పోవడం, పెద్ద మొత్తంలో ఓట్లకు కోత పడడాన్ని ఎవరి వైఫల్యంగా చూడాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. మంత్రి సొంత నియోజకవర్గం సూర్యాపేటలో మాత్రమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కాంగ్రెస్‌ అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇక, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 3,484 ఓట్ల ఆధిక్యం వచ్చినా.. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లను పోలిస్తే.. 29వేల పైచిలుకు ఓట్ల తగ్గుదల ఉంది. ఇక, ఏ నియోజకవర్గంలో చూసినా.. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన  మెజారిటీకి సమంగా ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యమయ్యేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

దెబ్బకొట్టిన కోదాడ.. హుజూర్‌నగర్‌
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూర్యాపేట, నల్లగొండల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి లీడ్‌ వచ్చింది. దేవరకొండ, నాగార్జున సాగర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి లీడ్‌ వచ్చినా.. అది నాలుగు వేల ఓట్ల చొప్పునే. కానీ, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థికి వచ్చిన ఆధిక్యమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని దెబ్బకొట్టిందని విశ్లేషిస్తున్నారు. వరసగా కోదాడలో 11,930,  హుజూర్‌గనర్‌లో 12,993, మిర్యాలగూడలో 7,186 ఓట్ల చొప్పున లీడ్‌ వచ్చింది. ఈ మూడు నియోజకవర్గాలే కాంగ్రెస్‌ అభ్యర్థిని విజయతీరాలకు చేర్చాయన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వైఫల్యం చెందారా ..? అన్న ప్రశ్నలపైనా చర్చ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఏమైనా వెన్నుపోటు రాజకీయాలు దెబ్బతీశాయా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే పార్టీ నాయకత్వం ఈ ఓటమిపై పూర్తిస్థాయి సమీక్ష జరిపే వీలుందని చెబుతున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top