కూకట్‌పల్లిలో కృష్ణారావు వద్దు

TRS Leaders Demand For Change Kukatpally MLA Candidate - Sakshi

ఉద్యమకారులకు కేటాయించాల్సిందే..

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రకటించిన కూకట్‌పల్లి అభ్యర్థిని మార్చి ఆ స్థానంలో ఉద్యమకారులకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాలని నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు, ఉద్యమకారులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఓ హోటల్‌లో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ మాజీ ఇన్‌చార్జి తేళ్ల నర్సింగరావు పటేల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంతకుముందు హోటల్‌ ముందు కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉద్యమకారులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చి కేసీఆర్‌ సీఎం అయ్యారని, కానీ నేడు వారిని పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమంలో కడుపు మాడ్చుకుని, రోడ్ల మీద్ద కూర్చున్నామని, అరెస్టులతో జైలుపాలయ్యమన్నారు. రెండో సారి ఎన్నికల్లో ఉద్యమకారులకు కాకుండా ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వ్యక్తులకు టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారికి టికెట్లు, పదవులు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి అభ్యర్థిని మార్చకుంటే కేసీఆర్‌ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాధవరానికే బీఫాం ఇస్తే డిపాజిట్లు రాకుండా చూస్తామన్నారు. స్వతంత్య్ర అభ్యర్థిగా ఉద్యమకారులు నిలబడితే గెలుపుకు కృషి చేయడమే కాకుండా రూ. 5లక్షలు ఇస్తానని టీఆర్‌ఎస్‌ నేత విజయ్‌కుమార్‌ ప్రకటించారు.

సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సునీల్‌రెడ్డి, దాసు, సతీష్, రాముగౌడ్, భిక్షపతి, దేవరాజ్, సత్యనారాయణ, మధుగౌడ్, నాగరాజు, శివరాజ్‌యాదవ్, దేవదానం, సుధా రవి, కవిత తదితరులు పాల్గొన్నారు.

కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వ్యతిరేకంగా ఏకమైన నాయకులు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top