ఎమ్మెల్యే శోభపై ఫిర్యాదు

TRS  Leaders Complaints To KCR On Bodiga Shobha Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: అసెంబ్లీ రద్దు ప్రతిపాదనకు ముందే చొప్పదండి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చొప్పదండి ఎమ్మెల్యే వ్యవహార శైలితో టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్దఎత్తున నష్టం వాటిళ్లనుందని నియోజకవర్గంలోని ప్రముఖ నేతలంతా సీఎం కేసీఆర్‌కు పిర్యాదు చేశారు. శోభక్క గాలన్న సైన్యం (ఎస్‌జీఎస్‌) పేరిట నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని పలువురు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు సీఎం కేసీఆర్‌ ఎదుట బుధవారం ఆవేదన వ్య క్తం చేసినట్లు సమాచారం. గురువారం అసెంబ్లీ రద్దు చేసి సీఎం కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బొడిగె శోభపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సీనియర్, నేతలు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 
దూకుడు పెంచిన అసమ్మతి వర్గం..
ముందస్తు ఎన్నికల శంఖారావు మోగనున్న నేపథ్యంలో చొప్పదండి నియోజకవర్గం అసమ్మతి నేతలు దూకుడు పెంచారు. చొప్పదండి రాజకీయాలు కొద్ది నెలలుగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. చొప్పదండి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఎమ్మెల్యే తీరు వివాదస్పదమైంది. కాగా.. ఇదే సమయంలో బుధవారం చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్యనేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది. మండలాల్లో ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీలకు ప్రత్యామ్నాయంగా తన శక్తి రూపించుకునేందుకు ప్రతీసారి మండల ప్రజాప్రతినిధులను డమ్మీలుగా చేసే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది.

టీఆర్‌ఎస్‌ నాయకుడు గడ్డం చొక్కారెడ్డి సతీమణి చొప్పదండి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఎమ్మెల్యే శోభ తీరు సరిగా లేదని నియోజకవర్గ నేతలు సీఎంకు వివరించినట్లు తెలిసింది. శోభక్క గాలన్న సైన్యం పేరుతో పలువురు ఎస్‌జీఎస్‌ నాయకులు అనేక గ్రామాల్లో తమకు నచ్చని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ వారి భయాందోళనలకు గురి చేస్తున్నారని చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గతేడాది నుంచి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. నియోజకవర్గంలోని మెజార్టీ మండలాల్లో అధికారంలో ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీలు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే తీరుపై తమ అసంతృప్తి సీఎం ఎదుట వెళ్లగక్కారు.

సీఎంను కలిసిన వారిలో కొడిమ్యాల, రామడుగు, బోయినపల్లి, గంగాధర, చొప్పదండి మండలాల జెడ్పీటీసీ సభ్యులు, కొడిమ్యాల, రామడుగు, బోయినపల్లి మండలాల ఎంపీపీలు, చొప్పదండి మల్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, తిరుమలాపూర్, పూడూరు సింగిల్‌విండోల చైర్మన్లు, కరీంనగర్‌ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, నాయకులు వీర్ల వెంకటేశ్వర్‌రావు, పొనుగోటి కృష్ణారావు, మేని రాజ నర్సింగరావు తదితరులు ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top