'పంచ'తంత్రం | TRS Focus on five Congress figures | Sakshi
Sakshi News home page

'పంచ'తంత్రం

Nov 25 2018 4:51 AM | Updated on Mar 18 2019 9:02 PM

TRS Focus on five Congress figures - Sakshi

రాష్ట్ర కాంగ్రెస్‌లో ఐదుగురు సీనియర్‌ నేతలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) గురి పెట్టింది. ఈ ఎన్నికల్లో వారిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యులైన వారి అనుచరులను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్‌ వేస్తోంది. ఈ ఐదుగురిని ముప్పుతిప్పలు పెట్టడం ద్వారా వారిని సొంత నియోజవకర్గాలు వదిలి బయటకు రాకుండా ఉండే మార్గాలను సిద్ధం చేసింది. హూజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి, గద్వాలలో డీకే అరుణ, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించడం అంత సులభం కాదన్న సంగతి తెలిసినా టీఆర్‌ఎస్‌ ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ఈ ఐదుగురు కాంగ్రెస్‌ ప్రముఖులను ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఇతర సీనియర్‌ నేతలను రంగంలోకి దించింది. ఈ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసింది. 

ఉత్తమ్‌ చుట్టూ ఉచ్చు..: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌లో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి తెలుసు. అయినా, ఆయనకు గట్టిపోటీనివ్వడానికి ఎన్నారై సైదిరెడ్డిని పోటీకి దించింది. ఇక్కడ సైదిరెడ్డికి బంధుగణం ఎక్కువ ఉండటం, రాజకీయాలకు కొత్త కావడంతో ఓటర్లను ఆకర్షించవచ్చని భావించింది. అలాగే, ఉత్తమ్‌ చుట్టూ ఉన్న నేతలను తమవైపునకు తిప్పుకోవడం ద్వారా ఉత్తమ్‌ను నియోజకవర్గం దాటి ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లకుండా నిరోధించాలనేది టీఆర్‌ఎస్‌ వ్యూహం. ఉత్తమ్‌ సతీమణి పద్మావతి కోదాడ దాటి హుజూర్‌నగర్‌ వెళ్లకుండా.. అక్కడ బలహీనవర్గాలకు చెందిన మల్లయ్య యాదవ్‌ను పోటీకి పెట్టింది. మాజీ ఎమ్మెల్యే చందర్‌రావుతో పాటు శశిధర్‌రెడ్డిని ప్రచారంలోకి దించింది. దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై ఉత్తమ్‌ దృష్టిసారించక తప్పని పరిస్థితి తేవాలని లక్ష్యం. 

కొడంగల్‌ బరిలో మంత్రి సోదరుడు : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డిని బరిలోకి దించింది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎనుముల రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ఓసారి పర్యటించా రు. మరో మంత్రి హరీశ్‌రావును నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా పెట్టింది. తెలంగాణలోని కనీసం 60 నియోజకవర్గాల్లో హెలికాప్టర్‌ ద్వారా పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయాలని రేవంత్‌ నిర్ణయించుకున్నారు. రేవంత్‌కు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించి..ఇతర నియోజకవర్గాల కంటే ఇక్కడే ఎక్కువగా ప్రచారం చేసే పరిస్థితులు కల్పించాలన్నది టీఆర్‌ఎస్‌ వ్యూహం. రేవంత్‌ను ఓడించేందుకు ఇక్కడ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ సంగతి తెలిసే రేవంత్‌ ఈ నెల 28న కొడంగల్‌కు రాహుల్‌గాంధీని రప్పిస్తున్నారు. 

కోమటిరెడ్డికి గట్టిపోటీ : నల్లగొండ నుంచి నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ అత్యంత  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో ఇదొకటి. గడచిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడోసారి పోటీ చేస్తున్న భూపాల్‌రెడ్డి ఈసారి తనకు సానుభూతి కలిసివస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. దానికి తోడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం భూపాల్‌రెడ్డి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి ఐదోసారి విజయం సాధించడానికి కొంత శ్రమపడాల్సి వస్తోంది. 

‘సాగర్‌’ దాటని ‘జానా’ : వరుసగా తొమ్మిదోసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కుందురు జానారెడ్డి (నాగార్జునసాగర్‌) ఈసారి విజయం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మధ్యలో 1994 మినహా జానారెడ్డి ఏడు సార్లు విజయం సాధిస్తూ వచ్చారు. ఇక్కడి నుంచి గడిచిన ఎన్నికల్లో ఆయనతో పోటీపడ్డ నోముల నరసింహయ్య యాదవ్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ వేల సంఖ్యలో ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన ఓట్లను రాబట్టుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ఎస్టీల్లోనూ చీలిక తేవడానికి టీఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు కొంత ఫలించాయి. మిర్యాలగూడ టిక్కెట్‌ తన కుమారుడు లేదా తన వర్గీయుడికి ఇప్పించుకునే ప్రయత్నంలో జానారెడ్డి ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో ఆయన నాగార్జునసాగర్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి..

మేనల్లుడితోనే పోటీ :  గద్వాల నుంచి బరిలో ఉన్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డీకే అరుణను ఓడించాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్‌ఎస్‌ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు తన ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అన్ని నియోజవకర్గాల్లో తిరుగుతూనే అడపాదడపా గద్వాల, ఆలంపూర్‌ను చుట్టి వస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే అరుణకు ప్రత్యర్థిగా ఆమె మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గంలోని బీసీల్లో మంచి పట్టున్న తిమ్మప్ప సోదరులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు గద్వాల నుంచి విజయం సాధిస్తూ వస్తున్న అరుణ ఈసారి తన గెలుపును ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. వరుసగా 20 ఏళ్ల నుంచి అరుణ శాసనసభ్యురాలిగా ఉన్నా నియోజకవర్గం పెద్దగా అభివృద్ది చెందలేదంటూ టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది. దీంతో అరుణ భర్త డీకే భరతసింహారెడ్డి గద్వాలలోనే మకాం వేసి అధికార పార్టీ వ్యూహాలను అడ్డుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement