కేసీఆర్‌ ముస్లింలకు క్షమాపణ చెప్పాలి: అజహరుద్దీన్‌  

TPCC Working President Azharuddin Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 12 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తానని మభ్యపెట్టి మోసం చేసినందుకు ముస్లింలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్‌ అమలు సాధ్యం కానప్పుడు ఎందుకు మభ్యపెట్టారని ప్రశ్నించారు. ఎన్నికల సభలో ముస్లిం యువకుడు రిజర్వేషన్‌పై ప్రశ్నిస్తే కేసీఆర్‌ స్పందించిన తీరు బాగాలేదని, స్థాయిని దిగజార్చుకునే విధంగా మాట్లాడారని దుయ్యబట్టారు. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు నదీమ్, జావిద్, రాష్ట్ర అధ్యక్షుడు సొహైల్, రాష్ట్ర ఇంచార్జి సలీం అహ్మద్, పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12% రిజర్వేషన్‌ ఎందుకు అమలు చేయలేదో కేసీఆర్‌ చెప్పాల్సిన అవసరం ఉందని, కేసీఆర్‌ సమాధానం చెప్పిన విధానాన్ని బట్టే ముస్లిం మైనారిటీల పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుందన్నారు. తనకు సికింద్రాబాద్‌ నుండి ఎంపీగా పోటీ చేయాలని ఉందని అజహరుద్దీన్‌ తెలిపారు. అయితే ఎక్కడి నుండి పోటీచేయాలన్నది పార్టీ హైకమాండ్‌æ నిర్ణయిస్తుందన్నారు. 

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అజహర్‌ 
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహ్మద్‌ అజహరుద్దీన్‌ నియమితులయ్యారు. మరో 14 మంది నేతలకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో చోటు దక్కగా, ఇందులో పలువురు ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేతలు కూడా ఉన్నారు. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా తాజా నియామకంపై అజహరుద్దీన్‌ యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. 

పీసీసీ ఉపాధ్యక్షులుగా బి.ఎం.వినోద్‌కుమార్, జాఫర్‌ జావెద్‌లు నియమితులయ్యారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఎస్‌.జగదీశ్వరరావు, నగేశ్‌ ముదిరాజ్, టి.నర్సారెడ్డి, మానవతారాయ్, ఫహీం, కైలాశ్, లక్ష్మారెడ్డి, క్రిశాంక్‌ నియమితులు కాగా, పీసీసీ కార్యదర్శులుగా దుర్గం భాస్కర్, దరువు ఎల్లన్న, విజయ్‌కుమార్, బాలలక్ష్మి నియమితులయ్యారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top