
మమతా బెనర్జీ (పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థి విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నటి, ఎంపీ జయా బచ్చన్‌ను తమ పార్టీ తరపున పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. టీఎంసీ సీనియర్ నేత ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు.
‘జయ ఓ సమర్థవంతమైన నాయకురాలు. పైగా ఆమెకు బెంగాలీ మూలాలు ఉన్నాయి. అందుకే ఆమెను మా పార్టీ తరపున రాజ్యసభకు పంపాలని నిర్ణయించాం’ అని ఆయన వెల్లడించారు. టీఎంసీ తరపున నలుగురు ఎంపీల పదవీకాలం ముగుస్తుండగా.. ఈసారి రెండే సీట్లే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, సమాజ్‌వాదీ పార్టీ(యూపీ నుంచి) తరపున రాజ‍్యసభకు జయ బచ్చన్ ఇప్పటికే మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఏప్రిల్ 3న ఎంపీగా ఆమె కాలపరిమితి ముగియనుంది. మార్చి 18న మమత స్వయంగా అభ్యర్థిగా జయా బచ్చన్ పేరును ప్రకటించే అవకాశం ఉందని టీఎంసీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏప్రిల్‌లో రాజ్యసభలో 58 మంది ఎంపీల కాలపరిమితి ముగుస్తోంది. వీటిలో ఉత్తర ప్రదేశ్ నుంచే 10 సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గరిష్ఠంగా 312 సీట్లు కైవసం చేసుకోవటంతో ఈ దఫా వారికే రాజ్యసభలో ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీకి ఒకే సీటు దక్కే అవకాశం ఉండటంతో మమతను సంప్రదించినట్లు తెలుస్తోంది.
మమతకు మద్ధతుగా అప్పట్లో...
కొన్నాళ్ల క్రితం బీర్భూమ్ నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ మీద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆంక్షలు విధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేవైఎం నేత యోగేష్ వర్ష్నే మమతపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. ఆమెను ఎవరైనా చంపితే 11 లక్షలు ఇస్తానంటూ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో తీవ్రంగా మండిపడ్డారు. ’మీరు ఆవులను కాపాడతామని చెబుతున్నారు గానీ మహిళల సంగతేంటి’ అని ఆమె బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.