రాప్తాడులో టెన్షన్‌.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు

Thopudurthi Prakash Reddy Election Campaign At Ramagiri Mandal - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే గత నాలుగున్నరేళ్లుగా మంత్రి పరిటాల సునీత సొంత గ్రామమైన రామగిరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. మంత్రి సునీత ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్‌ సీపీ నేతలను కూడా రామగిరి మండలంలోనికి అనుమతించలేదు. తాజాగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పరిస్థితులు మారాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాప్తాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి రామగిరి మండలం ఎన్నికల ప్రచారానికి పోలీసులు అనుమతిచ్చారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రామగిరి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ప్రకాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రామగిరి మండలంలోని ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సునీత తమ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రకాశ్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రకాశ్‌రెడ్డికి మద్దుతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. స్థానికులు మాత్రమే ప్రకాశ్‌రెడ్డి వెంట ప్రచారం చేయాలని ఆంక్షలు విధించారు. 

ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల సునీత దౌర్జన్యాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. పరిటాల సునీత మండలమైన రామగిరిలోకి వీసా తీసుకుని వెళ్లేలా పోలీసులు ఆంక్షలు విధించారని.. గత నాలుగున్నరేళ్లుగా తమను రామగిరిలోకి అనుమతించకపోవటం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. కొందరు పోలీసులు, అధికారులు పరిటాల సునీతకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రామగిరిలో సునీత ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు ఓటు వేయకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలను భయపెట్టి గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాప్తాడులో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top