అదే వేదన.. అవే కన్నీళ్లు.. చావుబతుకుల జీవితం

There is no Change in The Condition of Uddanam Kidney Victims We Are Hovering Between Deaths - Sakshi

సాక్షి, ఉద్దానం :  ‘అదే వేదన.. అవే కన్నీళ్లు. జబ్బు బారిన పడి చావుబతుకుల మధ్య జీవిత పోరాటం. కన్నీళ్లు తుడిచి కాసింత భరోసా ఇచ్చేవారే లేరు. వైద్యం అందకపోతే పట్టించుకునేవారే లేరు. నాలుగు రోజులకోసారి రక్తశుద్ధి రావాలంటే నరకయాతన. డయాలసిస్‌ భాగ్యం దక్కేవరకూ పడిగాపులు.. ఏదైతేనేం ఉద్దానం కిడ్నీ బాధితుల పరిస్థితిలో మార్పు లేదు.  చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం.. ఎన్నికల ముందుకు పెన్షన్‌లో వెయ్యి రూపాయలు పెంచి సర్కారు చేతులు దులుపుకుంది.. సమయానికి మందులుండవు.. బయట కొనుక్కునే స్తోమత లేదు.. చావుతో పోరాటం చేస్తున్నాం..’  ఇదీ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల్లో ఆవేదన. 

ఉద్దానం ప్రాంతంలో సుమారు 110 గ్రామాల్లో కిడ్నీ బాధితులు ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఒక్కో డయాలసిస్‌ సెంటర్‌లో 30 మందికి పైగా  వేచి చూస్తున్న బాధితులున్నారు. పలాస, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలిలో డయాలసిస్‌ సెంటర్లున్నాయి. తాజాగా కవిటిలో పెట్టారు. ఒక్కో మెషీన్‌కు రోజుకు మూడు డయాలసిస్‌ సెషన్లు మాత్రమే జరుగుతాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాలి. కానీ ఇవి సరిపోకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డయాలసిస్‌ బాధితులకు సరిపడా మందులు ఇవ్వకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులు మార్చాలి. కానీ కొన్ని రకాల మందులే ఇస్తుండటంతో బయట కొనుక్కుంటున్నామని బాధపడుతున్నారు. ఒక్కో నెలకు రూ.6 వేలు అదనంగా ఖర్చవు తోందని వాపోయారు. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నవి వేరు, ఇక్కడ ఇస్తున్నవి వేరు, ఇలా అయితే మేమెలా బతుకుతామని బాధితులు అంటున్నారు. 

వెయ్యి పెంచి చేతులు దులుపుకున్నారు.. 
గత కొన్నేళ్లుగా తమకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తేగానీ సరిపోదని అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం రూ.2,500 ఇస్తూ, ఎన్నికల ముందు మరో రూ.వేయి మాత్రమే పెంచిందని పలువురు బాధితులు వాపోయారు. రెండు మూడేళ్లలో చచ్చిపోయేవాళ్లం కదా ఆ మాత్రం కూడా ప్రభుత్వానికి కనికరం లేదంటే ఏమనుకోవాలని ఆవేదనగా వాపోయారు. అదీగాక రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది వరకూ బాధితులుండగా, కేవలం 3,500 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నట్టు బాధితులు చెప్పుకొచ్చారు. 

జగన్‌ హామీతో బాధితుల్లో భరోసా 
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కిడ్నీ, గుండెజబ్బులు, తలసీమియా వంటి బాధితులకు నెలకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తామన్న వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి హామీతో బాధితుల్లో కాసింత భరోసా వచ్చింది. మందులకయ్యే వ్యయం మొత్తం తామే భరించి పెన్షన్‌ రూ.10 వేలు చేస్తే అంతకంటే తమకు కావాల్సింది ఏముంటుందని ఉద్దానం ప్రాంత బాధితులు అంటున్నారు. ప్రస్తుతం కొంతమంది బాధితులకే పెన్షన్‌ వస్తోందని, జగన్‌ వస్తే బాధితులందరికీ పెన్షన్‌ ఇస్తారన్న ఆశతో ఉన్నట్టు అక్కడి బాధితులు చెబుతున్నారు. 

అత్యవసరమైతే విశాఖ వెళ్లాల్సిందే  
గత కొంతకాలంగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నాను. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. అత్యవసరం అనుకుంటే విశాఖ వెళ్లి డయాలసిస్‌ చేయించుకోవాలి. మందులు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఈ బాధలు పగవాడికి కూడా వద్దు. రూ.2,500 ఇస్తున్న పెన్షన్‌కు మరో వెయ్యి పెంచారు. ఇది ఏమూలకు సరిపోతుంది? .  
–అప్పలస్వామి, గొల్లమూకన్న పల్లి, పలాస 

ఎక్కువ రోజులు బతకబోమని తెలిసి కూడా.. 
 నా భార్య జయలక్ష్మి ఇక్కడ డయాలసిస్‌ చేయించుకుంటోంది. మందులు సరిగా అందడం లేదు. పెన్షను 3,500 ఇస్తే, ఒక్కసారి డయాలసిస్‌కు వస్తే ఖర్చవుతోంది. మేము ఎక్కువ రోజులు బతకమని తెలిసి కూడా రూ.3,500 పెన్షన్‌ మాత్రమే ఇవ్వడం బాధిస్తోంది. 
–కోటేశ్వరరావు, (కిడ్నీ బాధితురాలు జయలక్ష్మి భర్త), అక్కుపల్లి, ఉద్దానం  

– గుండం రామచంద్రారెడ్డి, ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top