దైవం 'నైవేద్య' రూపేణా..

Unique culture in Uddhanam villages - Sakshi

గజ ముద్దలతో ఉత్సవ విగ్రహాలు

మే, జూన్‌ వరకు గ్రామాల్లో సంబరాలు 

ఉద్దానం పల్లెల్లో విశిష్ట సంస్కృతి 

నిర్మలమైన నీలాకాశానికి మబ్బుతునకలు చుట్టపు చూపుగా వచ్చే వేళ.. నెర్రెలిచ్చిన నేలకు నింగి నుంచి మేఘ సందేశం అందే వేళ.. ఆ ఊరిలో టకోరం మోగుతుంది. సన్నాయికి జతగా డోలు లయబద్ధంగా ఉరుముతుంది. పడతుల చేతుల్లో కడవలు, ఆ కడవల్లో పసుపు నీరు ఎదురు చూస్తూ ఉండగా.. ఆ సందడిలో అమ్మ ఊరేగింపు మొదలవుతుంది. అనంతమైన ఆకాశాన్ని చూస్తూ అందమైన గజముద్ద ముత్తైదువుల నెత్తిపై అమ్మవారి ప్రతి రూపంగా కొలువై ఉంటుంది. ముత్తైదువుల పాదాలను పసుపు నీళ్లు తాకుతూ ఉంటే తల్లి ఊరేగింపు కన్నుల పండువగా సాగుతుంది. ఊరుఊరికీ అమ్మ పేరు మారినా ఉత్తరాంధ్రలో జాతర జరిగే తీరు మాత్రం ఇదే. ఉత్సవంలో ఊరేగింపు.. ఆనక ఆరగింపు ఇక్కడి ప్రత్యేకత. ఇంకాస్త లోతుల్లోకి వెళితే..   

ఇచ్ఛాపురం రూరల్‌: ఫిబ్రవరి నుంచి జూలై వరకు.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ఒడిశా ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో చల్లదనం ఉత్సవాలు మొదలవుతాయి. గ్రామదేవతలను ఇష్టంగా అర్చించుకుని సంబరం జరుపుకునే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ అమ్మవారు.. అవును అచ్చంగా అమ్మవారే. నైవేద్యాన్ని దేవత రూపంలో కొలిచే అపురూప సంస్కృతి ఈ పల్లెలు మనకు పరిచయం చేస్తాయి. నెయ్యిలు లేదా పేలాలుగా పిలిచే ఆహార పదార్థంతో అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఉత్సవ విగ్రహంలా పూజించి ఉత్సవం అయ్యాక ప్రసాదంలా ఆరగించే విశిష్టమైన పద్ధతి సిక్కోలు పల్లెల సొంతం.  

ఊరి అమ్మోరికి.. 
ప్రతి పల్లెను ఓ అమ్మవారి అంశ కాపాడుతూ ఉంటుందని స్థానికుల నమ్మిక. కాళీమాత, చింతామణి, భూలోకమాత, బాలామణి, అసిరిపోలమ్మ, నూకాలమ్మ, ధనరాజులమ్మ, స్వేచ్ఛావతి వంటి పేర్లతో గ్రామ దేవతలను పూజించుకుని ఏటా సంబరం చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతి రూపంగా నెయ్యిలతో తయారు చేసిన ‘గజముద్ద’ను పుష్పాలు, బంగారం, కరెన్సీ నోట్లతో అందంగా, ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో ఊరేగిస్తారు. 

పాకంతో పసందు 
ధాన్యం నుంచి సేకరించిన పేలాలతో తయారు చేసే ఈ పదార్థం రుచి చెప్పనలవి కానిది. ముందుగా కట్టెల పొయ్యిపై పెద్ద కళాయిని వేడి చేసి అందులో నీటిని వేడి చేస్తారు. అందులో పంచదార లేక బెల్లంను వేసి పాకం రూపం ఎర్రగా వచ్చే వరకు వేడి చేస్తారు. అనంతరం సమకూర్చిన పేలాలను పాకంలో వేసి ప్రత్యేకంగా తయారు చేసిన తెడ్డు(గరిటె)తో జిగురుగా వచ్చే వరకు కలుపుతారు. పొయ్యిపై నుంచి కిందకు దించి వేడిగా ఉన్న పాకం ముద్దను చేతులకు మంచి నూనెను పూసుకొని వివిధ ఆకృతుల్లో గజముద్దను తయారు చేస్తారు. అచ్చం అమ్మవారి పోలికల్లో నేత్రాలు, చేతులు, హారం, కిరీటాన్ని తయారు చేస్తారు. ఇందులో బెల్లంతో తయారుచేసే ప్రతిమల ధర ఎక్కువ. పాకం పక్కాగా ఉంటే నెల వరకు ఇది నిల్వ ఉంటుంది.  నైవేద్యం సులువుగా జీర్ణమయ్యేందుకు అందులో నిమ్మ, జీలకర్ర, వాము వంటి పోపులను వేస్తుంటారు. సైజును బట్టీ చక్కెరతో తయారు చేసిన గజముద్దలు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ధర పలికితే, బెల్లంతో తయారు చేసిన గజముద్ద రూ.2వేల నుంచి రూ.8వేల వరకు పలుకుతుంది. 

గజముద్దలకు కేరాఫ్‌ ఉద్దానం 
నెయ్యిలతో ప్రత్యేకంగా తయారు చేసే గజముద్ద ప్రసాదానికి కేరాఫ్‌ ఉద్దానం. ఇక్కడి పల్లెల్లో వీటిని అధికంగా తయారు చేస్తారు. గ్రామాల్లో చిన్నపాటి హొటళ్లు నడిపే గుడియాలు ఈ గజముద్దలను తయారుచేస్తారు.

అమ్మవారి స్వరూపం 
అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే గజముద్దను అమ్మోరు స్వరూపంగా భావించి పూజలు చేస్తాం. భక్తులు ఎంతో భక్తితో తలపై ధరించి ఊరేగిస్తారు. ఉద్దానం ప్రాంతంలో ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది.  
– డీబీ పురుషోత్తం, అమ్మవారి పూజారి 

తరాల నుంచి తయారీ  
మా కుటుంబం తరతరాల నుంచి అమ్మవారి నైవేద్యం గజముద్దను తయారు చేస్తోంది. నాణ్యమైన ధాన్యం పేలాలను సేకరించి పవిత్రంగా తయారు చేస్తాం. ఫిబ్రవరి నుంచి జూన్, జూలై నెల వరకు గిరాకీ ఉంటుంది. 
– ధ్రౌపతి గుడియా, ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top