కౌంటింగ్‌కు ఏర్పాట్లు 

Telangana Lok Sabha Elections Result Arngements Mahabubnagar - Sakshi

పాలమూరు: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి 17వ లోక్‌సభకు తమ ప్రతినిధిగా ఎవరిని పంపాలనే నిర్ణయాన్ని ప్రజలు ఓటు రూపంలో తీర్పునివ్వగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇది చేసి 40 రోజులు దాగా అందులో దాగి ఉన్న ఓటర్ల మనోగతం తేలేందుకు గడువు సమీపిస్తోంది. ఈనెల 23న గురువారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ నిర్వహించగా అదేరోజు రాత్రి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఈవీఎంలను సీల్‌ చేసి జిల్లా కేంద్రంలోని జేపీఎన్‌ఈఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో భద్రపరిచారు. అదే కళాశాలలో ఓట్లు లెక్కించనున్నారు.  
 
మొదట పోస్టల్‌ బ్యాలెట్లు 
ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు అనంతరం సర్వీస్‌ ఓట్లు లెక్కిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక టేబుల్‌ ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఈవీఎంలను తెరిచి రౌండ్ల వారీగా ఓట్లు లెక్కిస్తారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా ఓట్లు లెక్కించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మొదటి రౌండ్లు అన్నింటినీ కలిపి పార్లమెంట్‌ స్థానంలో మొదటి రౌండ్‌గా గుర్తించి ఫలితాలు వెల్లడిస్తారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్లను, పార్లమెంట్‌ స్థానంలో రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్లను పార్లమెంట్‌ స్థానంలో రౌండ్ల వారీగా మొదట ఎన్నికల సంఘానికి చెందిన సువిద వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.

ఆ తర్వాతే మీడియాకు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తారు. ఓట్లు లెక్కించే కేంద్రంలో నిరంతరం వీడియో చిత్రీకరణ జరుగుతుంది. ఇందుకోసం సీసీ కెమెరాలు బిగింపు పూర్తయింది. సీసీ కెమెరాల ద్వారా మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌తోపాటు హైదరాబాద్, ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయాల్లో లైవ్‌గా వీక్షించే ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. 23న ఉద యం 8గంంటలకు ఓట్లు లెక్కింపు ప్ర క్రియ ప్రారంభమైనా మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానంలో తుది ఫలితం రాత్రి 7గంటల తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వీవీప్యాట్‌ చిట్టీల లెక్కింపు 
తొలిసారిగా వీవీప్యాట్‌లలోని చిట్టీలు (ఓటర్‌ స్లిప్‌) లెక్కించనున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 5పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసి ఆ పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్‌లు తెప్పించి, వాటిలోని ఓటర్‌ స్లిప్‌లు బయటకు తీసి లెక్కిస్తారు. ఓటరు చిట్టీలు అభ్యర్థుల గుర్తులు వారీగా వేరు చేసి 25 చిట్టీలు ఒక కట్టగా కట్టి లెక్కిస్తారు. వీవీప్యాట్‌లలో లెక్కించిన చిట్టీలు, అంతకుముందు ఈవీఎంలలో లెక్కించిన ఓట్లు సరిపోలిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చిట్టీలు మళ్లీ లెక్కిస్తారు. వీవీప్యాట్‌లలోని చిట్టీలను లెక్కించేందుకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో లాటరీ పద్ధతిన 5 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేస్తారు. అలాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 14 టేబుళ్లు వేస్తారు. 14టేబుళ్లపై ఒకసారి లెక్కించిన ఓట్లు ఒక రౌండ్‌గా భావిస్తారు. ఇలా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఓటర్ల ఆధారంగా రౌండ్లు నిర్ణయిస్తారు. ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ రౌండ్లు ఉంటాయి. తక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో  తక్కువ రౌండ్లు ఉంటాయి.

కౌంటింగ్‌ ఏర్పాట్ల పరిశీలన 
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ భగీరథకాలనీ జేపీఎన్‌ఈఎస్‌ కళాశాల వద్ద కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్‌ హాళ్లు, టేబు ళ్లు, బారీకేడ్లు, కళాశాల వద్ద భద్రత వంటి విషయాలను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత ఏఆర్వోలకు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట ఇన్‌చార్జ్‌ జేసీ స్వర్ణలత, కలెక్టరేట్‌ ఏఓ ప్రేమ్‌రాజ్, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, ఆర్డీఓలు శ్రీనివాస్, సీహెచ్‌ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
 
లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి
 
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వీవీప్యాట్‌లలో స్లిప్పుల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పా టు చేసిన సమావేశంలో కౌంటింగ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేసిన వీవీప్యాట్‌లలో స్లిప్పులను లెక్కించాల్సి ఉందని, వీవీప్యాట్‌ల లెక్కిం పు అనంతరం ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి జేసి స్వర్ణలత, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, ఆర్డీఓలు శ్రీనివాస్, సి.హెచ్‌.శ్రీనివాస్, కౌంటింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top