Newly Married Couples Filing Divorce Case Increased In Mahabubnagar - Sakshi
Sakshi News home page

తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు

Published Mon, Aug 30 2021 9:19 AM

Newly Married Couples Filing Divorce Cases Increased In MahabubNagar - Sakshi

  • ఓ మండలంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే వ్యక్తి రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి కూతురు ఉంది. ఇటీవల అత్త, మామ ఇంట్లో ఉంటున్నారని భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ వచ్చారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో వారితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.
     
  • మహబూబ్‌నగర్‌ పట్టణంలోని టీడీగుట్టకు చెందిన భార్యాభర్తలు హైదరాబాద్‌లో ఉండేవారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇద్దరూ జిల్లా కేంద్రానికి వచ్చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అతను ఆటో నడిపేవాడు. భార్య ఓ దుకాణంలో పనిచేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో ద్వారా అశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో పాటు తరచూ అతను మద్యం తాగడం వల్ల గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరినీ పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

మహబూబ్‌నగర్‌ క్రైం: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత కాలంతో పాటు మనుషులు పరుగెడుతున్నారు. ఫలితంగా చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భార్యాభర్తలు, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు మాత్రమే ఇంట్లో ఉంటారు. ఈ నేపథ్యంలో పలుసార్లు మనస్పర్థలు తలెత్తుతున్నాయి.

ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో కేసుల వరకు వెళ్తున్నారు. మహిళలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తుండటంతో కౌన్సెలింగ్‌ ఇచ్చి కొందరిని ఒక్కటి చేస్తున్నారు. మరికొందరు మాత్రం పట్టు విడవకుండా చట్టం ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఏడాది కాలంగా గృహహింస కేసులు పెరిగాయి. ఆనందోత్సాహాలతో అన్యోనంగా కలిసి ఉండాల్సిన దంపతుల మధ్య క్షణికావేశాలు, భావోద్వేగాల కారణంగా పట్టు, విడుపులు లేని ధోరణి పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి.

నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే గోరంత సమస్యను కొండంతలుగా చేసుకుని విడిపోతున్నారు. పంతాలు, పట్టింపులకు పోయి తానేమీ తక్కువ కాదంటూ రాజీ పడకుండా ఆలోచన శక్తిని కోల్పోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వారి కాపురాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. దంపతులతో పాటు వారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తున్నాయి. తల్లిదండ్రులు వేరుగా ఉంటున్న కుటుంబాల్లో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేసేవారు లేక పక్కదారి పడుతున్నారు.
(చదవండి: దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే)

కౌన్సెలింగ్‌ సెంటర్‌తో భరోసా 
ఇలా చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలను చక్కదిద్దేందుకు, వివిధ రూపాల్లో మహిళలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ విడిపోవాలనుకుంటున్న దంపతులకు సర్దుకుపోవాలంటూ వారిలో అనుబంధాన్ని పెంచేందుకు మహిళా పోలీస్‌స్టేషన్‌లోని ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ భరోసా ఇస్తోంది. విడిపోవాలనుకున్న దంపతుల్లో ఆశలు చిగురింపజేసి కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు సరైన మార్గనిర్దేశం చేస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది.
(చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో)

వందల సంఖ్యలో
దంపతుల మధ్య వివాదాలు ప్రతినెలా వందల సంఖ్యలో ఠాణాకు వస్తున్నాయి. వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే హిందూ సంప్రదాయంలోనూ అనుబంధాలు బీటలు బారుతున్నాయి. ఇద్దరి మధ్య అవగాహనలోపం.. భార్యాభర్తల బంధం విలువ తెలియకపోవడంతో ఇటీవల కాలంలో పోలీస్‌స్టేషన్లకు ఎక్కువగా ఇలాంటి కేసులు వస్తున్నాయి. అందులో కొన్ని కౌన్సెలింగ్‌ ద్వారా సద్దుమణుగుతుండగా చాలా వరకు యువ జంటలు విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. దంపతుల మధ్య విభేదాలు పెరగడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండటమే కారణమవుతోంది.

ఎవరికి వారు ఒంటరిగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నందున ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది. అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా అనుభవం ఉన్న పెద్దలు సర్దిచెప్పే అవకాశం ఉండేది. దీంతో అక్కడికక్కడే సమస్య పరిష్కారమై దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేది. అయితే ఉరుకులు, పరుగుల జీవితంలో పెళ్లయిన వెంటనే వేరు కాపురం పెట్టడం వల్ల దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే మనోధైర్యం లేక విడాకుల వరకు తీసుకెళ్తోంది.



కౌన్సెలింగ్‌కే ప్రాధాన్యం ఇస్తాం 
కౌన్సెలింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తాం. చిన్న సమస్యలతో కోపంగా మా వద్దకు కొందరు వస్తారు. వారి కుటుంబసభ్యులు కానీ, పెద్ద మనుషులతో కానీ మాట్లాడాలని చెబుతాం. చాలా కేసులు ఫిర్యాదుల వరకే ఉంటాయి. ఇటీవల పెళ్లయి నెల రోజులకే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌కు రావడం చూస్తుంటే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడికి వచ్చిన భార్యాభర్తల సమస్యను మొదట గుర్తిస్తాం. దీనికి పరిష్కారం దొరికితే నిజాయితీగా కలుస్తారనుకుంటే కలపడానికి యత్నిస్తాం. ఇక ఎన్నిసార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చినా మారరనే వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తాం.
- హన్మప్ప, సీఐ, మహిళా పోలీస్‌ స్టేషన్, మహబూబ్‌నగర్‌

వివాదాలకు కారణాలివే
ఆర్థిక సమస్యలు, భర్త మద్యానికి, ఇతర వ్యసనాలకు బానిస కావడం, వివాహేతర సంబంధాలు, దంపతుల మధ్య ఒకరిపై మరొకరికి అనుమానం, అదనపు కట్నం, ఇరువర్గాల కుటుంబసభ్యుల అనవసర జోక్యం, ఇతర వేధింపులు కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే వివాదాలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం చదువుకున్న వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువ జంటలు భర్త తల్లిదండ్రులకు సేవ చేయాల్సి వస్తుందోనని ముందే మానసికంగా ఇబ్బందిపడి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ గొడవలకు కారకులవుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement