పెండింగ్‌ స్థానాల అభ్యర్థుల ఖరారు!

Telangana Elections 2018 KCR To Announce Pending Seats - Sakshi

నేడు ప్రకటించనున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహాల్లో వేగం పెంచుతోంది. ఆపార్టీ విడుదల చేసిన తొలిజాబితాలో అభ్యర్థులను ప్రకటించకుండా ఆపిన 12 స్థానాలకు పోటీచేసే నేతల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ మేరకు శనివారం కసరత్తు పూర్తి చేశారు. ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అసంతృప్తికి గురయ్యే నేతలతో మాట్లాడాలని మంత్రి కేటీఆర్‌ను ఆదేశించగా ఆయ న కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా కేటీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు. టికెట్‌ ఆశిస్తున్న వారితో తానే స్వయంగా మాట్లాడారు. ద్వితీయశ్రేణి నేతలతో మాట్లాడే బాధ్యతను ఆయా జిల్లాల ముఖ్యనేతలకు అప్పగించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆదివారం బీఫారాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణ యించారు. ఎన్నికల వ్యూహంపై అందరికీ వివరించే ముందే పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆఖరి నిమిషంలో మార్పులు ఉంటే తప్ప పెండింగ్‌ సీట్లకు ఆదివారమే అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందరు అభ్యర్థులకు కలిపి ఒకేసారి ప్రచారంపై మార్గనిర్దేశనం చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సెప్టెంబరు 6న 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం పెండింగ్‌ సీట్ల అభ్యర్థుల జాబితా ఇలా ఉండనుంది. ఖైరతాబాద్‌– దానం నాగేందర్, గోషామహల్‌– ప్రేమ్‌సింగ్‌ రాథోడ్, ముషీరాబాద్‌– ముఠా గోపాల్, అంబర్‌పేట– కాలేరు వెంకటేశ్, మేడ్చల్‌– సి.హెచ్‌.మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి–మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండి– సుంకె రవిశంకర్, వరంగల్‌తూర్పు– నన్నపునేని నరేందర్, హుజూర్‌నగర్‌– శానంపూడి సైదిరెడ్డి/ అప్పిరెడ్డి, కోదాడ– వేనేపల్లి చందర్‌రావు/కె.శశిధర్‌రెడ్డి, వికారాబాద్‌– టి.విజయ్‌కుమార్‌/ఎస్‌.ఆనంద్, చార్మినార్‌– దీపాంకర్‌పాల్‌/ఇలియాస్‌ ఖురేషీ.

జీయర్‌స్వామి ఆశీస్సులు...
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటుగా రాజ్యసభ్యుడు జె.సంతోష్‌ కుమార్‌లు శనివారం శంషాబాద్‌లో ఉన్న జీయర్‌ ఇంటిగ్రేటెడ్‌ వేదిక్‌ అకాడమిలోని దివ్యసాకేతాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయరుస్వామి ఆశీస్సులు తీసుకున్నారు.  

నేడు ఎర్రవల్లిలో సమావేశం...
కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నేడు ప్రచార సభ నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు గజ్వేల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్‌ సమావేశమవుతున్నారు. 15 వేల మంది ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top