రేపే ఫలితాలు

Telangana Assembly Elections Results On 11th December - Sakshi

మరో 24 గంటలు తప్పని ఉత్కంఠ

31 జిల్లాల్లో 44 లెక్కింపు కేంద్రాలు

లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

 ఉదయం 8 గం.కు కౌంటింగ్‌ షురూ

రెండు, మూడు గంటల్లో ఫలితాలు

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ‘కూటమి’ కాపలా  

సాక్షి, హైదరాబాద్‌: నరాలుతెగే ఉత్కంఠకు రేపు తెరపడనుంది. మరో 24 గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటరు తన మనోభీష్టాన్ని దాచిన ఈవీఎంలు మంగళవారం తెరుచుకోనున్నాయి. విజయంపై అన్ని పార్టీలు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల అందరిలో టెన్షన్‌ నెలకొంది. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్య ర్థులతో పాటు కార్యకర్తలకు ఈ 24 గంటలు క్షణమొక యుగంలా మారాయి. గత శాసనసభ ఎన్నికల్లో 69.5% మాత్రమే పోలింగ్‌ జరగగా, ఈసారి రికార్డు స్థాయిలో 73.2 శాతానికి పోలింగ్‌ పెరగడంపై సరైన అంచనాలు అంద డం లేదు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించేందుకు 44 చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌటింగ్‌ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జరగనున్న ఒక రౌండ్‌లో ఒకేసారి 14 పోలింగ్‌ కేంద్రాల ఓట్ల లెక్కలు తేలనున్నాయి. ప్రతి టేబుల్‌ వద్ద ఓ పర్యవేక్షకుడు, ఓ సహాయ పర్యవేక్షకుడు, ఓ సూక్ష్మ పరిశీలకుడిని నియమిం చనున్నారు. ఇప్పటికే కౌంటింగ్‌ సిబ్బందికి మొదటి దఫా శిక్షణ ఇవ్వగా.. సోమవారం రెండో విడత శిక్షణ ఇస్తారు. అభ్యర్థుల తరఫున కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక కౌటింగ్‌ ఏజెంట్‌ను లెక్కింపు కేంద్రంలోపలకు అనుమతించనున్నారు.

ఉదయం 8.30 నుంచి ఫలితాలు షురూ!
ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలను ఎప్పటి కప్పుడు రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వీసు, పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించి తొలి రౌండ్‌ ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. బ్యాలెట్‌ యూనిట్లను కంట్రోల్‌ యూనిట్లకు అనుసంధానం చేసి రిజల్ట్‌ మీటను నొక్కగానే సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది స్క్రీన్‌ మీద కనిపించనుంది. లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులు, అభ్యర్థుల ఏజెంట్లు తమకు అప్పగించిన దరఖాస్తుల్లో ఓట్లకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరించిన తర్వాత సంబంధిత రౌండ్‌కు సంబంధించిన ఫలితాలను ప్రకటించనున్నారు.

నాలుగైదు రౌండ్ల ఫలితాల సరళి ఆధారంగా ఉదయం 9.30 గంటల సమయానికే చాలాచోట్ల గెలుపోటములపై కొంత మేర స్పష్టత వచ్చే అవకాశముంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వరుసగా ఒక్కో నియోజకవర్గం ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల కల్లా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు బహిర్గతం కానున్నాయి. శాసనసభ ఎన్నికల బరిలో నిలబడిన 1,821 అభ్యర్థుల్లో 119 మంది విజేతలెవరో తేలిపోనుంది. సీసీ టీవీ కెమెరాల నిఘాలో మొత్తం కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. 

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం
ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశముందన్న కూటమి నేతల అనుమానాల నేపథ్యంలో స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సంబంధిత నాయకులు కాపలా కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని పాల్మాకులలోని స్ట్రాంగ్‌రూమ్‌లో 8 నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపర్చారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో వాహనాలు తనిఖీ చేసి పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. రెండో అంచెలో 500 మీటర్ల వరకు కేంద్రం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా బలగాలు గస్తీ కాస్తున్నాయి. మూడో అంచెలో సీసీ కెమెరాలు, కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. రెండు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. సుమారు వెయ్యి మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక బలగాల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతితో ప్రజాకూటమి బృందాలు ఇక్కడ శనివారం సాయంత్రం నుంచి కాపలాగా ఉంటున్నాయి. ఆయా నియోజకవర్గాలతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు రాత్రి, పగలు ఇక్కడే ఉండి స్ట్రాంగ్‌ రూంలు ఉన్న కేంద్రంపై నిఘా పెట్టారు. కౌంటింగ్‌ ఏజెంట్లు మంగళవారం ఉదయం 7 గంటల లోపే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు జారీ చేసిన పాసులతో రావాల్సి ఉంటుంది. సెల్‌ఫోన్‌లను కౌంటింగ్‌ కేంద్రంలోనికి అనుమతించరని.. కేవలం పాసులు ఉన్న వారినే లోనికి పంపిస్తారని అధికారులు వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top