వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి | TDP leaders attacked YSRCP activists | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి

Jun 25 2018 4:18 AM | Updated on Aug 10 2018 9:52 PM

TDP leaders attacked YSRCP activists - Sakshi

క్షతగాత్రులను అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యం, దాడిలో గాయపడిన భూషణం

దాచేపల్లి (గురజాల): అధికార మదంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కొత్తపల్లి యోహాను, కాటుపల్లి భూషణం, కొత్తపల్లి పిచ్చయ్య, మామిడి అబ్రహాం, కొత్తపల్లి రాజా, దైద నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నాగరాజు మినహా మిగిలిన వారికి పరిస్థితి విషమం ఉంది. వీరు వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా ఉండడం, పార్టీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి గ్రామంలో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయడంతోపాటు పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేస్తుండటం వల్లే టీడీపీ నేతలు కక్షతో దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు.

పథకం ప్రకారమే దాడి
తంగెడ గ్రామానికి చెందిన యోహాను, భూషణం, పిచ్చయ్య, అబ్రహాం, రాజా, నాగరాజు మరికొంత మంది గ్రామంలో తాము రోజూ కలుసుకునే అరుగుపై కూర్చొని ఉన్నారు. అదేసమయంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి దీనరాజ్, దైద యోగేశ్వరరావు, కొత్తపల్లి భాస్కరరావు, దైద వెంకటరత్నం, దైద దయానందం, దైద కిరణ్, కొత్తపల్లి మరియదాసుతో పాటు మరో 20 మందికి పైగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల వద్దకు వచ్చి దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఇలా మాట్లాడడం మంచిది కాదని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చెబుతుండగానే అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న గొడ్డళ్లు, ఇనుపరాడ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల బంధువులు వెంటనే 108 వాహనానికి సమాచారామిచ్చి వారిని గురుజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని గుంటూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. ఎస్సై అద్దంకి వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని సందర్శించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. 

దాడిని ఖండించిన కాసు, జంగా
తంగెడ గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి తెగబడడాన్ని వైఎస్సార్‌ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్‌రెడ్డి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో అనేక మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, వీటికి ప్రతిఫలం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో టీడీపీ నేతలు గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని, దాడులను అందరం ధైర్యంగా ఎదుర్కొందామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement