అభ్యర్థి ఎవరో..?

TDP Fear on Ongole Parliament Member Seat - Sakshi

టీడీపీకి ఒంగోలు భయం

పార్లమెంట్‌ అభ్యర్థి కోసం టీడీపీ వెదుకులాట

పోటీకి మాగుంట విముఖత

బరిలో నెల్లూరు జిల్లా నేత బీదా మస్తాన్‌రావు?

బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం

ఆ వర్గం ఓట్లు పొందే ఎత్తుగడ

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అభ్యర్థి కరువయ్యారు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి తాను పోటీ చేయలేనని ఎమ్మెల్సీ మాగుంట చేతులెత్తేయడంతో ఇప్పుడు టీడీపీకి అభ్యర్థిని వెతుకు లాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తొలుత ఎమ్మెల్సీ కరణం బలరాంను ఒంగోలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయించాలని ఆలోచించినా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కరణంను చీరాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి నిలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. బీదా సోదరులు ఇందుకు అంగీకరిస్తారా.. లేదా..? అన్నది తెలియాల్సి ఉంది.

ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ అధిష్టానం పలుమార్లు ప్రకటించింది. తానే పోటీలో ఉంటానని మాగుంట సైతం ప్రకటించారు కూడా. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు నుంచి తాను పోటీ చేయలేనని ఎమ్మెల్సీ మాగుంట టీడీపీ అధిష్టానానికి, ఇటు జిల్లా నేతలకు తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో మాగుంట ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సమర్థులైన అభ్యర్థులు లేరని వీరితో కలిసి పోటీకి దిగితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చేతులో ఓటమి ఖామయని మాగుంట భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జిల్లా నేతలకు ఆయన వివరించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉందని, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోవడం సాధ్యమయ్యేది కాదని మాగుంట భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం, జిల్లా నేతలు బుజ్జగించినా ఆయన ససేమిరా అంటున్నట్లు సమాచారం. మాగుంట పోటీకి దూరమయ్యే పక్షంలో టీడీపీకి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కనిపించడం లేదు. ఆర్థికబలం, అంగబలం ఉన్న మాగుంటే ఓడిపోతానని చెబితే మిగిలిన వారు పోటీకి ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒంగోలు పార్లమెంటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటలా మారింది. రోజు రోజుకు ఆపార్టీ పార్లమెంటు నియోజకవర్గంలో బలం పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తెలిసి పోటీ చేసి ఓటమి కొని తెచ్చుకోవడం ఎందుకని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ  ముందుకు రావడం లేదు. బయటి ప్రాంతాల నుంచి కొత్త వారిని తెచ్చి ఇక్కడ పోటీలో నిలపాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది.

బలరాంను చీరాలలో నిలిపేందుకు సీఎం పట్టు..
మాగుంట పోటీ నుంచి తప్పుకుంటే టీడీపీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత కరణం బలరాంను ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగింది. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవడంతో కరణం బలరాంను చీరాల నుంచి బరిలో దింపుతారన్న ప్రచారం జోరందుకుంది. తాము చీరాల నుంచి పోటీ చేయడం లేదని, ఆ నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలలో ఒకరిని టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలుపుతామని కరణం చెబుతున్నా.. సీఎం ఒత్తిడి తెస్తే చివరకు కరణం బలరాం పోటీలో ఉండక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కరణం ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది.

తెరపైకి బీదా..
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. బీదా మస్తాన్‌రావు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా యాదవ సామాజిక వర్గం బలంగానే ఉంది. బీసీ ఓటు బ్యాంకు ఎక్కువే. మరో వైపు ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే బీసీ అభ్యర్థి లేరు. ఒకవేళ చీరాలకు బీసీ అభ్యర్థిని కేటాయిస్తే ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా కరణం బలరాంను చీరాల అభ్యర్థిగా ఎంపిక చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ నుంచి బీసీ అభ్యర్థి లేనట్లే అవుతోంది. ఈ క్రమంలో పార్లమెంటు నుంచి బీసీ అభ్యర్థిని నిలిపి ఆ సామాజిక వర్గం ఓట్లను ఆకట్టుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన సోదరుడు బీదా రవిచంద్రతో బుధవారం రాత్రి అమరావతిలో అధిష్టానం చర్చలు జరిపింది. ఈ పరిస్థితిలో బీదా సోదరులు ఒంగోలు నుంచి బరిలోకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top