
సుజనా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు కేంద్ర తాజా మాజీమంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి నిరాకరించారు. చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిప్రదేశ్‌గా మార్చారని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ నాయకులు విఫలమయ్యారని, కేంద్రానికి హోదాను తాకట్టు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే పవన్ వ్యాఖ్యలపై తాను మాట్లాడబోనని సుజనా చౌదరి అన్నారు.
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్‌లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. తన ప్రసంగ పాఠానికి ఎన్నో సవరణలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీనామాల ద్వారా కదలిక వస్తుందనుకున్నామని, కానీ బీజేపీ పట్టించుకోవడం లేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు రావడం లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సుజనా చౌదరి చెప్పారు. కాగా, చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్రమంత్రి పదవికి సుజనా చౌదరి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.