ఎస్పీ–బీఎస్పీ కూటమికి ఆర్‌జేడీ మద్దతు

SP-BSP alliance with RJD support - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఏర్పడిన ఎస్‌పీ–బీఎస్‌పీ కూటమికి రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ) మద్దతు తెలిపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయం దేశమంతటా ప్రభావం చూపనుందని పేర్కొంది. ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సోమవారం అఖిలేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యూపీలోని మా పార్టీ శ్రేణులు ఎస్‌పీ–బీఎస్‌పీ కూటమికి మద్దతునిస్తాయి. యూపీ పరిణామం దేశవ్యాప్తంగా సంకేతాలు పంపింది.

కేంద్రంలో అధికారంలోకి ఎవరు రావాలనే విషయాన్ని యూపీ, బిహార్‌ రాష్ట్రాలే నిర్ణయించనున్నాయి’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు. తేజస్వీ ప్రకటనతో యూపీలో తమ కూటమి మరింత బలోపేతమవుతుందని అఖిలేశ్‌ అన్నారు. ‘మా కూటమిని అందరూ స్వాగతించారు. దేశ ప్రజలు బీజేపీ పాలనతో విరక్తి చెందారు. బీజేపీ ప్రజలను మోసం చేసింది. అందుకే ప్రజలు ఆ పార్టీని గద్దె దించాలనుకుంటున్నారు’ అని అఖిలేశ్‌ తెలిపారు. యూపీ కూటమి నుంచి కాంగ్రెస్‌ను పక్కనపెట్టారు కదా అని తేజస్వీని ప్రశ్నించగా.. ‘అందరి లక్ష్యం ఒక్కటే, అదే బీజేపీని ఓడించడం.

వీళ్లు ఇక్కడ గెలుస్తారు..మేం అక్కడ గెలుస్తాం’ అంటూ బిహార్‌లో కాంగ్రెస్‌తో కొనసాగుతున్న పొత్తుపై బదులిచ్చారు. తన తండ్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కన్న కలలను నిజం చేసిన ఎస్‌పీ–బీఎస్‌పీ నేతలకు కృతజ్ఞతలు చెప్పేందుకే లక్నో వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం మాయావతి కాళ్లకు నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను తేజస్వీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కాగా, బీజేపీ పన్నిలో ఉచ్చులో ఇరుక్కున్న ఎస్‌పీ, బీఎస్‌పీలు యూపీలో తమతో సంబంధం లేకుండానే కూటమిగా ఏర్పడ్డాయని కాంగ్రెస్‌ తెలిపింది. యూపీలోని లౌకికవాద రాజకీయ పార్టీలను ఏకం కాకుండా చేసి ఓట్లను చీల్చడం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనే బీజేపీ ప్రయత్నాలు విజయవంతమయ్యాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆర్‌పీఎన్‌ సింగ్‌ అన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top