కర్ణాటక ఫలితాల్లో అన్నీ షాక్‌లే!

Somany Shocks In Karnataka Results - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో షాకులపై షాక్‌లు కనిపిస్తున్నాయి. మొత్తం 28 సీట్లలో 25 సీట్లను బీజేపీ గెలుచుకోవడం ఓ షాకైతే, జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తుముకూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి కేవలం 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం మరో షాక్‌! బెంగళూరు రూరల్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే సురేశ్‌ రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం మరో షాక్‌. దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవన్న హస్సన్‌ నియోజక వర్గం నుంచి గెలుపొందడం షాక్‌ కాకపోయిన విశేషమే. దేవెగౌడ గతంలో ప్రాతినిధ్యం వహించిన తన హస్సన్‌ సీటును మనవడికి అప్పగించి తాను తుముకూరు నుంచి పోటీ చేయడం వల్లనే తన ఓటమి, మనవడి విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తాత ఓడిపోయాడన్న వార్త తెలిసి బాధ పడుతున్న ప్రజ్వల్‌ రేవన్న తన సీటుకు రాజీనామా చేసి ఆ సీటును తిరిగి తాతకు అప్పగించాలని చూస్తున్నారని వార్తలు వెలువడడమూ షాకే! దేవెగౌడ మరో మనవడు నిఖిల్‌ కుమార స్వామి, బీజేపీ మద్దతుతో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత అంబరీష్‌ చేతిలో ఓడిపోవడం మరో షాక్‌. కాంగ్రెస్‌ దిగ్గజాలైన వీరప్ప మొయిలీ చిక్కబల్లాపూర్‌ నుంచి, మల్లిఖార్జున ఖర్గే, గుల్బర్గా నుంచి ఓడి పోవడం షాకే. గత ఏడాది మే నెలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, జేడీ (ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వం ఆది నుంచి ఆటుపోట్లతోనే నడుస్తోందని, దీన్ని చూసిన ప్రజలు ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే బీజేపీని గెలిపించారని సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌-జెడీఎస్‌ మధ్య సీట్ల పంపకాల్లో కూడా చాలా తేడాలు వచ్చాయి. ఆ తేడాలు కూడా ఈ పార్టీల ఓటమికి కారణం అయ్యాయి. సమీప భవిష్యత్తులోనే కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి అతిపెద్ద షాక్‌ తగిలే అవకాశం ఉందని, జేడీఎస్‌ ఎమ్మెల్యేల్లో కొందరు బీజేపీలో చేరిపోయే అవకాశం ఉందని, అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడం అతి పెద్ద షాకవుతుందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top