ఆ నలుగురు ఎవరో..

Sitting MLAs Fearing About KCR Survey For Next Elections Contesting - Sakshi

డేంజర్‌ జోన్‌లో ఉన్న ‘డైమండ్ల’పై సర్వత్రా చర్చ 

కలకలం రేపుతున్న సీఎం కేసీఆర్‌ సర్వే

సోషల్‌ మీడియాతో కొత్త చిక్కులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: అధికార పార్టీకి చెందిన 39 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఆదరణ తగ్గిం దంటూ వస్తున్న వార్తలతో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేయించిన సర్వేలో 39 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో జాబితాలో తమ పేరు ఉందేమోననే సందేహం సిట్టింగుల్లో నెలకొంది. దీంతోపాటు సోషల్‌ మీడియాలో వరుసగా వస్తున్న వార్తలతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన పెరిగిపోతోంది. 

నెలరోజుల వ్యవధిలోనే తమ పరిస్థితి తారుమారు కావడంపై అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరూ ‘డైమండ్స్‌’ అంటూ కితాబు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

సర్వే రిపోర్టుతో అలజడి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొన్నారు. అలాగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అర్బన్‌ ఏరియాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు.. తమ డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతున్నారు. మొత్తంగా రాబోయే సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలో తెరపైకి కొత్తగా వచ్చిన సర్వే రిపోర్టు వారిలో అలజడి రేపుతోంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎదురులేని విధంగా ఉంది. ఒక్క నర్సంపేటను మినహాయిస్తే మిగిలిన జిల్లా అంతటా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇదే సమయంలో సగానికిపైగా నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు ఉన్నారు. ఉదాహరణకు వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉండగా.. ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, నన్నపునేని నరేందర్‌ కూడా ఇక్కడి నుంచే టికెట్‌ను ఆశిస్తున్నారు. మహబూ బాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో శంకర్‌నాయక్‌ సిట్టిం గ్‌ కాగా.. మాలోతు కవిత ఆశావహురాలిగా ఉన్నా రు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో స్పీకర్‌ మధుసూదనాచారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకాగా... ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు గండ్ర సత్యనారాయణ ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కొండా సుస్మితాపటేల్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇలా పోటీ పెరిగిన నేపథ్యంలో నేతలు ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కడం కష్టమంటూ పార్టీ వర్గాలు తేల్చిచెప్పడంతో ఇబ్బందిగా మారింది.

సోషల్‌ మీడియా ప్రచారం..
ప్రజల్లో ఆదరణ తగ్గిన 39 మంది టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వీరేనంటూ సోషల్‌ మీడియాలో పేర్లు చక్కర్లు కొడుతుండడం పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సంబం«ధించి నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఈ లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ నేతకు టిక్కెట్‌ దక్కుతుందా.. లేదా అనే అనుమానంలో వారి అనుచరులు ఉన్నారు. ఇదే విషయాన్ని నేరుగా అడుగుతుండడంతో ప్రతిసారి సమాధానం చెప్పుకోవా ల్సిన పరిస్థితి వస్తోంది. ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో లిస్టు బయటకు రావడం, దాని వెంట సోషల్‌ మీడియా ప్రచారంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top