ఎన్నికల ప్రచారానికి సురవరం, ఏచూరి

sitaram yechury election campaigning on may - Sakshi

వచ్చే నెల మొదటివారంలో పర్యటన

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చేనెల మొదటివారంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల పొత్తుల్లో భాగంగా భువనగిరి, మహబూబాబాద్‌ (ఎస్టీ) స్థానాల నుంచి సీపీఐ, నల్లగొండ, ఖమ్మంల నుంచి సీపీఎం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నాలుగు స్థానాల్లో ఇరుపార్టీలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయా సభల్లో రెండు పార్టీల నాయకులు పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.  

1, 2 తేదీల్లో సురవరం సభలు
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఏప్రిల్‌ 1న భువనగిరిలో, 2న మహబూబాబాద్‌లో నిర్వహించే ఎన్నికల బహిరంగసభల్లో పాల్గొంటారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు వచ్చే నెల మొదటివారంలో ప్రచారం నిర్వహించనున్నారు. వచ్చేనెల 4న బహుజన్‌ సమాజ్‌పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి, జనసేన నేత పవన్‌కల్యాణ్‌ల ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించే అవకాశాలున్నాయి. సీపీఐ, సీపీఎం పోటీ చేయని స్థానాల్లో జనసేన, బీఎస్పీ, ఎంసీపీఐ(యూ), బీఎల్పీ, ఎంబీటీలకు మద్దతునివ్వాలని సీపీఎం నిర్ణయించగా, జనసేన, బీఎస్పీ, బీఎల్పీ వంటి పార్టీలకు మద్దతునిచ్చే విషయాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోంది.

ఉమ్మడి సమావేశాలు...
తాము పోటీ చేసే నాలుగు స్థానాల్లో మెరుగైన రీతిలో పరస్పరం సహకరించుకునేందుకు సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా లోక్‌సభ నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ నెల 27న ఖమ్మంలో, 28న మహబూబాబాద్‌లో నిర్వహించనున్న సమావేశాల్లో ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుల నుంచి మండల కమిటీ సభ్యుల వరకు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న నల్లగొండ, 31న భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సంయుక్త సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆయా లోక్‌సభ సీట్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు, మండలాల్లో కూడా రెండుపార్టీల సంయుక్త సమావేశాలు నిర్వహించనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top