ఆలూ లేదు.. చూలూ లేదు.. నంబర్‌ టు రేస్‌!

Shocking Response In Congress Over Revanth Reddy Comments Shabbir As Number 2 - Sakshi

కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న రేవంత్‌ వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌లో ‘డిప్యూటీ సీఎం’దుమారం రేగింది! కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహ్మద్‌ అలీ షబ్బీర్‌ నంబర్‌–2 అవుతారంటూ కామారెడ్డి రోడ్‌షో సభలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం కొత్త లొల్లికి దారితీసింది. కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాక, అభ్యర్థుల ప్రకటన వెలువడక సతమతమవుతున్న వేళ మరో తలనొప్పి ఏమిటనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్‌ వ్యాఖ్యలపై బయటకు ఎవరూ విమర్శలు చేయకపోయినా ఈ కొత్త సంస్కృతి విపరీత పరిణామాలకు దారితీస్తుందని సీనియర్‌ నేతలు హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి పరిణామాలు పార్టీలో ఐక్యతకు గండికొడతాయని, ఎన్నికల సమయంలో పదవుల గురించి మాట్లాడితే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందంటూ ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడొకరు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు. ప్రాంతీయ పార్టీ నేతల మాదిరి కాంగ్రెస్‌లో నేతలు మాట్లాడటం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుందని ఆ ఎంపీ లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

టీపీసీసీ ముఖ్యుల్లో కలవరం... 
రేవంత్‌ పథకం ప్రకారం మాట్లాడారో లేక యాధృచికంగా మాట్లాడారో కానీ షబ్బీర్‌ అలీ గెలిస్తే డిప్యూటీ సీఎం అవుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి సీనియర్‌ నేతలు, టీపీసీసీ ముఖ్యులు కోలుకునేందుకే కొంత సమయం పట్టిందని, ఉన్నట్లుండి రేవంత్‌ ఎందుకు అలా మాట్లాడారన్న దానిపై ఆరా తీశారని గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏఐసీసీ స్థాయి నేతలు వచ్చినప్పుడు కూడా అధికారంలోకి వస్తే సీఎం ఎవరని అడిగినా వారు చెప్పడం లేదని, అలాంటప్పుడు రేవంత్‌ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారో అంతుపట్టడం లేదని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే 10 మంది సీఎం అభ్యర్థులున్నారంటూ అధికార టీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలకు తోడు తాజాగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలతో డిప్యూటీ సీఎం ఆశావహుల జాబితా కూడా చాంతాడంత అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దీనివల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు షబ్బీర్‌ అలీతోపాటు తాము కూడా డిప్యూటీ సీఎం పదవికి అర్హులమేననే చర్చ అప్పుడే కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రారంభమైంది. ముఖ్యంగా సామాజిక కోణంలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతలు ఇప్పుడు ఈ జాబితాలో చేరుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారిలో సీఎం స్థాయి నేతలు కూడా ఉన్నారని, వారితోపాటు తాము కూడా డిప్యూటీ సీఎం బరిలో ఉంటామని అర డజను మంది నేతలు బయలుదేరడం పార్టీలో రేవంత్‌ వ్యాఖ్యల తీవ్రతను తెలియజేస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top