
సాక్షి,పాట్నా: మోదీ సర్కార్‌పై వీలుచిక్కినప్పుడల్లా ధిక్కార స్వరాలు వినిపిస్తున్న బీజేపీ ఎంపీ, నటుడు శతృఘ‍్న సిన్హా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. శనివారం జరిగిన పాట్నాయూనివర్సిటీ కార్యక్రమానికి తాను హాజరుకాకున్నా దేశంలో అతిపెద్ద యాక్షన్ హీరో వెంట తానెప్పుడూ ఉంటానని సిన్హా పేర్కొన్నారు. తాను బీజేపీని వీడుతానన్న ప్రచారం అవాస్తవమని తోసిపుచ్చారు. తానెప్పుడు మోదీ వెంటే ఉంటానని, చివరి నిమిషంలో తనకు పాట్నా వర్సిటీ కార్యక్రమం గురించి ఆహ్వానం అందడంతో హాజరుకాలేకపోయానని వివరణ ఇచ్చారు. తాను ఆ కార్యక్రమానికి హాజరైనా, కాకున్నా ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీష్‌ను ఒకే వేదికపై చూడాలన్న తన కోరిక నెరవేరిందని అన్నారు. వీరిద్దరి అనుబంధం దీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న శత్రుఘ్న సిన్హా పలు సందర్భాల్లో పార్టీ వైఖరికి భిన్నంగా స్పందించారు. మోదీ ఆర్థిక విధానాలను విమర్శించిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను శత్రుఘ్న సిన్హా గట్టిగా సమర్ధించారు. దీనికితోడు ప్రతిష్టాత్మక పాట్నా యూనివర్సిటీ వేడుకలకు ఆయన గైర్హాజరవడంతో సిన్హా పార్టీ వీడుతారనే ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ శత్రుఘ్న సిన్హా ప్రధాని మోదీని ప్రశంసల్లో ముంచెత్తడం గమనార్హం.