నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు: షబ్బీర్‌ అలీ

Shabbir ali commented over trs about his phone taping - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ ప్రోద్బలంతో పోలీసు ఉన్నతాధికారులు తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. అనుమతి లేకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్న అధికారులపై చర్య తీసుకోవా లని గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు. సోమ వారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకొని తప్ప ఫోన్‌ను ట్యాపింగ్‌ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. అనుమతి లేకుండా తన ఫోన్‌తోపాటు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. గవర్నర్‌ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ట్యాపింగ్‌కు పాల్పడిన అధికారులను జైలుకు పంపించడం ఖాయమన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న టీఆర్‌ఎస్‌ పోలీసులను వాడుకొని ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతోందన్నారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సర్వేల్లో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత  
అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోయిందని షబ్బీర్‌ అన్నారు. అసెంబ్లీ రద్దుకు ముందు అనుకూలంగా వచ్చిన సర్వే నివేదికలు తర్వాత వ్యతిరేకంగా రావడంతో కేసీఆర్‌కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం వరకు టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ మరింత పడిపోతుందన్నారు. శాసనమండలి ఎప్పుడు నిర్వహిస్తారో అధికారులకు క్లారిటీ లేదని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించాల్సిన తేదీలను సైతం కేసీఆర్‌ వెల్లడిస్తున్నాడన్నారు. ముస్లిం ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్‌ తమ వైఖరి వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌తోనే బడుగులకు న్యాయం: పొన్నం
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌తోనే బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుం దని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడుగులకు అనేక వాగ్దానాలు చేయడంతోపాటు ఆత్మగౌరవ భవనాలు నిర్మి స్తామని చెప్పి ఆత్మగౌరవం లేని బతుకులు చేసిందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో పూర్తిగా విఫలమయ్యాయని, పాలకుల వైఫల్యాలను ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మార్చి ఊరూ రా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర కీలకమని, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్‌లో ఒక్కో సంఘటన చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పోరాటం చేశారని చెప్పారు. కేసీఆర్‌ మూడు వందల ఏళ్లు పోరాడినా, ఇంకేమైనా అరిగిపోయేవరకు ఉద్యమం చేసినా.. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. పార్లమెంట్‌లో కేసీఆర్‌ పాత్ర ఏమీలేదని, సోనియా గాంధీ ఇవ్వడంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. కేసీఆర్‌ పార్లమెంట్‌లో కీలక పాత్ర పోషించి ఉంటే విభజన బిల్లులో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ముంపు గ్రామాలు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు.  

టీఆర్‌ఎస్‌లోనే కుమ్ములాటలు  
కాంగ్రెస్‌ కంటే టీఆర్‌ఎస్‌లోనే అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులు ఎక్కువని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రస్తుతం మా పోరాటం కేసీఆర్‌పైనే అని, దీనికోసం అందరం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌లో సీఎం అభ్యర్థి కేసీఆర్, కవిత, హరీశ్, కేటీఆర్, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌లో ఎవరో చెప్పాలని ప్రశ్నిం చారు. అధిష్టానం తనకు ఇచ్చిన బాధ్యతలు తు.చ. తప్పకుండా నిర్వర్తిస్తానని, పార్టీ బలోపేతం కోసం కోసం కృషి చేస్తానని చెప్పారు.

ఎమ్మెల్యేగా పోటీ చేయను: జైపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తాను మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఎస్‌.జైపాల్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు తరచూ పత్రికల్లో వస్తున్న వార్తల్ని ఖండించారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి మాత్రమే పోటీ చేయనున్నట్లు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top