నవంబరొచ్చినా.. నిధులు రాలే!

Severe shortage of funding for roads and buildings department - Sakshi

రోడ్లు, భవనాల శాఖకు నిధుల కొరత తీవ్రం..

ఆర్థిక ఇబ్బందుల్లో కాంట్రాక్టర్లు

మరోసారి పనులు నిలిపివేసే యోచన

ప్రభుత్వం స్పందించకపోతే చావే శరణ్యమంటూ ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖను నిధుల కొరత వేధిస్తోంది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ హామీతో కనీసం నవంబర్‌లోనైనా పరిస్థితి మారుతుందని ఆశించిన కాంట్రాక్టర్లకు మరోసారి నిరాశే మిగిలింది. దీంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 20 వేల కోట్ల పనులను చేపట్టిన కాంట్రాక్టర్లకు తొలిదశలో రూ.6,500 కోట్లు చెల్లించాలని తెలంగాణ బిల్డర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ మొదటివారంలో పనులు నిలిపివేసి తమ నిరసన తెలిపింది. 

ఈ నెలపై గంపెడాశలు.. 
గత నెల కాంట్రాక్టర్ల సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంట్రాక్టర్ల అసోసియేషన్‌తో చర్చలు జరిపారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోనూ చర్చలు జరిగాయి. అపుడు కాంట్రాక్టర్లకు స్పష్టమైన హామీ రాకపోయినా.. రూ.6,500 కోట్లు తొలి విడతగా బకాయిలు విడుదల చేస్తామని చెప్పడంతో నమ్మకంతో తిరిగి పనులు చేపట్టారు. అక్టోబర్‌ చివరి వారంలోనూ కాంట్రాక్టర్లు మంత్రి కేటీఆర్‌ను కలసి తమ సమస్యలను విన్నవించారు. అయినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. బ్యాంకుల్లో, ప్రైవేటుగా కోట్ల రూపాయల మేర అప్పులు తెచ్చి మరీ తాము పనులు చేపట్టామని.. తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. అప్పులిచ్చిన పలు ప్రైవేటు బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే.. తమకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు.
 
మరోసారి సమ్మె దిశగా... 
నవంబర్‌లోనూ నిధుల విడుదలపై స్పష్టత లేకపోవడంతో కాంట్రాక్టర్లు డైలమాలో పడ్డారు. అక్టోబర్‌ మొదటి వారంలో పనులు నిలిపివేసి నిరసన తెలిపిన కాంట్రాక్టర్లు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారని సమాచారం. తమపై ఆర్థిక భారం పెరిగిపోతుండటంతో పనులు నిలిపి వేసే దిశగా కాంట్రాక్టర్లు యోచిస్తున్నట్లు తెలిసింది.

అప్పుపై తేల్చని కన్సార్టియం..
ఈ ఏడాది రోడ్లు, భవనాల శాఖకు బడ్జెట్‌లో దాదాపుగా రూ.5,600 కోట్లు కేటాయించినా.. సరిగా విడుదల కాలేదు. దాదాపు రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చుకోవాలని ప్రభుత్వమే ఆర్‌ అండ్‌ బీకి సలహా ఇవ్వడంతో అధికారులు అప్పుల వేటకు సిద్ధమయ్యారు. అంత పెద్ద మొత్తాన్ని ఒకే బ్యాంకు సర్దుబాటు చేయలేదు కాబట్టి అధికారుల వినతితో ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం ఏర్పడింది. ఇందులో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు ఉన్నాయి. మే నెలలో ఈ కన్సార్టియం వీరికి అప్పులు ఇవ్వాలా? లేదా అన్న విషయంపై యోచనలో పడింది. కానీ, ఇప్పటికీ రుణం మంజూరు చేయలేదు. ఈలోపు ఇటు శాసనసభ రద్దు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top