రెండో దశ లోక్‌సభ ఎన్నికలు: లైవ్‌ అప్‌డేట్స్‌

Second Phase Lok Sabha Elections 2019 Live Updates - Sakshi

దేశవ్యాప్తంగా నేడు జరిగిన రెండో విడత ఎన్నికల్లో 61.12శాతం పోలింగ్‌ నమోదైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అస్సాంలో 73.32, బీహార్‌ 58.14, ఛత్తీస్‌ఘడ్‌ 68.70, జమ్మూ కశ్మీర్‌ 43.37, కర్ణాటక 61.80, మహారాష్ట్ర 55.37, మణిపూర్‌ 74.69, ఒడిశా 57.41, పుదుచ్చేరి 72.40, తమిళనాడు 61.52,  ఉత్తర ప్రదేశ్‌ 58.12, పశ్చిమ బెంగాల్‌లో 75.27 శాతం నమోదైంది.

దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరిగింది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో ఎన్నికల జరగిగాయి. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 
 కర్ణాటక ప్రముఖ పర్యావరణవేత్త, పద్మ అవార్డు గ్రహిత సాలుమరద తిమ్మక్క(107) ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరు రూరల్‌ పార్లమెంట​ నియోజకవర్గంలో ఆమె ఓటు వేశారు. సాలుమరద తిమ్మక్క కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త. ఈమె హులికుల్ నుండి కుడుర్ వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందారు.

అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు తమిళనాడులో 47 శాతం పోలింగ్‌ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోలో 50.39 శాతం, కర్ణాటకలో 49.25, పశ్చిమ బెంగాల్‌లో 60, బీహార్‌ 49.25, అసోం 49.28, ఛత్తీస్‌గఢ్‌ 59.72, మహారాష్ట్ర 49.5, ఒడిశాలో 45, మణిపూర్‌లో 68.75, కశ్మీర్‌లో 38.5 శాతంగా పోలింగ్‌ నమోదైంది.

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌నంద్‌గాన్‌ నియోజకవర్గంలో ఓటు వేశారు. 

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కొంతమంది దుండగులు పెట్రోల్‌ బాంబుతో దాడి చేశారు. గుంపులుగా వచ్చి అలర్లు సృష్టించారు. అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జ్‌ చేసి అల్లరిముకలను చెదరగొట్టారు. 

తన నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేస్తున్నారని ఉత్తరప్రదేశ్‌లోని అంరోహ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కన్వార్‌ సింగ్‌ తన్వార్‌ ఆరోపించారు. బుర్ఖాలు ధరించి వస్తున్న వారిని సరిగా తనిఖీ చేయడం లేదని ఆరోపించారు. బుర్ఖా ధరించి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని పట్టుకున్నట్టు తాను విన్నానని చెప్పారు. ఫతేపూర్‌ సిక్రీలోని మంగోలి కాలా గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామానికి మంచినీటి వసతి కల్పించనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 41వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో మధ్యాహ్నం వరకు ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.

మండ్య జిల్లా, మద్దూరు తాళూకా దొడ్డహసనకరెలో స్వతంత్ర అభ్యర్థి సుమలతా అంబరీష్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దొడ్డహసనకరెలో మండ్య లోకసభ అభ్యర్థులు సుమలత, నిఖిల్‌ గౌడ అభిమానుల మధ్య తీవ్రవివాదం చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తేచ్చే ప్రయత్నం చేసినప్పటికి గొడవ సద్దుమణగలేదు. మంత్రి డీకే శివకుమార్‌ దొడ్డ హలహల్లిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు దర్శన్‌ బెంగళూరులోని ఆర్‌ఆర్‌నగర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌ సీపీఎం నేత, రాయ్‌గంజ్‌ లోక్‌సభ అభ్యర్థి మహ్మద్‌ సలీమ్‌ కారుపై దుండగులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్‌ ఇస్లామాపూర్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడి వెనుక టీఎంసీ హస్తం ఉందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన కుటుంబసభ్యులతో కలిసి క్యూలైన్‌లో నిలబడి, ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీజేపీ ఎంపీ అభ్యర్థి కన్వర్‌ సింగ్‌ తన్వర్‌ అమోరాలో దొంగ ఓటింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. బుర్కాలో ఉన్న వారిని పరీక్షించటం లేదని, మగవాళ్లు బుర్కాలో వచ్చి దొంగ ఓట్లు వేసినట్లు విన్నానన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దారామయ్య మైసూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రాల వారీగా ఉదయం 11గంటల వరకు ఉత్తరప్రదేశ్‌ 24.31%, బీహార్‌ 18.97%, అస్సాం 26.39%, ఛత్తీస్‌ఘడ్‌ 26.2%,తమిళనాడు 30.62%  పోలింగ్‌ నమోదైంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులు ఫరూక్‌ అబ్దుల్లా, ఉమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌లోని మున్సిబాగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌ రాయ్‌గంజ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ సందర్భంగా అల్లరిమూకలు రెచ్చిపోవటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అ‍ల్లరి మూకల్ని చెదరగొట్టారు. దీంతో ఆగ్రహించిన అల్లరిమూకలు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌, రబ్బరు బుల్లెట్లతో గాల్లోకి కాల్పులు జరిపారు.

మధుర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్‌ సీనియర్‌ నటి హేమమాలిని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రత్యర్ధి పార్టీలపై నిప్పులు చెరిగారు తన వల్లే మధురలో అభివృద్ధి జరిగిందని అన్నారు. ఎస్పీ, బీఎస్పీలు ఒకరిని ఒకరు తిట్టుకోవటానికే పనికొస్తాయంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో మోదీ ప్రభావం కచ్చితంగా ఉందని అన్నారామె. ఒరిస్సాలోని అస్కా నియోజకవర్గంలోని కన్సమారి పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటు వేయటానికి క్యూలైన్‌లో నిల్చుని ఉన్న 95ఏళ్ల వృద్ధుడు అక్కడే ప్రాణాలు విడిచాడు.

మాజీ భారత ప్రధాని హెచ్‌డీ దేవె గౌడ, ఆయన సతీమణి హస్సన్‌లోని పదువాలహిప్పేలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  అస్సాం సిల్చర్‌ సిట్టింగ్‌ ఎంపీ, సిల్చర్‌ లోక్‌సభ అభ్యర్థి సుష్మితా దేవ్‌ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాశ్మీర్‌లో అప్పుడే పెళ్లైన ఓ జంట పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్‌ బూత్ వద్దకు చేరుకుని ఓటు వేశారు. పెళ్లి బట్టల్లో ఉన్న ఈ జంటను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా వారి సామాజిక స్ప్రహను పలువురు ప్రశంసించారు.

ఛత్తీస్‌ఘడ్‌లోని కంకెర్‌లో బూత్‌ నెంబర్‌ 186లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి గుండెపోటుతో పోలింగ్‌ బూత్‌లోనే ప్రాణాలు విడిచాడు. యూపీ కాంగ్రెస్‌ ఛీఫ్‌, ఫతేపూర్‌ సిక్రి అభ్యర్థి రాజ్‌ గబ్బర్‌ రాధ బల్లబ్‌ ఇంటర్‌ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 13.48 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రాల వారీగా అసోం 11.6%, ఉత్తరప్రదేశ్‌ 10.76%, ఛత్తీస్‌ఘడ్‌ 10.42%, తమిళనాడు 13.48%, మణిపూర్‌ 14.99%, బీహార్‌ 12.07% పోలింగ్‌ నమోదైంది.

కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అనిత, కొడుకు నిఖిల్‌తో కలిసి రాంనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. నిఖిల్‌ మాండ్యా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

చెన్నైలోని తెనంపేటలో ఎస్‌ఐఈటీ కాలేజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఓటు వేశారు. తిరువాన్మియూరు ప్రభుత్వ పాఠశాలలో నటులు అజిత్, విజయ్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి జి పరమేశ్వర ఆయన భార్య కన్నిక పరమేశ్వరి తుంకూరులోని కొరతగిరేలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దత్తాత్రేయ హొసబలే శేషాద్రిపురంలోని బూత్‌నెంబర్‌ 45లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించటం కారణంగా ఒరిస్సాలోని పలు పోలింగ్‌ స్టేషన్లలలో పోలింగ్‌కు అంతరాయం ఏర‍్పడింది. సమస్యను పరిష్కరించిన అనంతరం పోలింగ్‌ యధావిధిగా కొనసాగింది.

ఒరిస్సాలోని కందమాల్‌ అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ రెచ్చిపోయారు. పోలింగ్‌ సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సంజుక్తా అనే పోలింగ్‌ ఏజెంట్‌ ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

నటులు సూర్య, కార్తిలు కుటుంబంతో కలిసి చెన్నైలోని టీనగర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రకాశ్‌ రాజ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్‌నుంచి లోక్‌సభ బరిలో ఉన్న విషయం తెలిసిందే. డీఎంకే నాయకురాలు, తుత్తుకుడి లోక్‌సభ అ‍భ్యర్థి కనిమొళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మణిపుర్‌ గవర్నర్‌ నజ్మా హెపుల్లా ఇంపాల్‌లో తన ఓటు హక్కునువినియోగించుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోకనాయకుడు కమల్‌హాసన్‌ ఆయన కుమార్తె శృతి హాసన్‌లు సైతం ఓటు హక్కు వినియోగించుకోవటానికి సాధారణ పౌరులతో పాటు క్యూలైన్‌లో నిల్చున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌, నటుడు విజయ్‌ ఆంటోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధురైలో ఉత్సవాల కారణంగా రాత్రి 8గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు ఎన్నికల డీజీపీ అశుతోష్‌ శుక్లా దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాంగ్రెస్‌ నేత చిదంబరం భార్య నలిని చిదంబరం, కుమారుడు కార్తి చిదంబరం ఆయన భార్య శ్రీనిధి రంగరాజన్‌ కారైకుడిలోని శివగంగలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కారణంగా తమిళనాడులో సినిమా ధియేటర్లు మూతపడ్డాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ బెంగళూరులోని జయానగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటం కారణంగా పోలింగ్‌ ఇంకా ప్రారంభంకాలేదు.

ఈ ఉదయం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్‌ స్టార్‌ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకోగానే ఆయన్ని చూడడానికి అభిమానులంతా ఎగబడ్డారు. రజనీ పోలింగ్‌ కేంద్రంలోకి అడుగుపెట్టగానే అక్కడి అధికారులు లేచి నిలబడ్డారు. కాంగ్రెస్‌ నేత చిదంబంరం తమిళనాడులోని కారైకుడి శివగంగలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ నేత సుశీల్‌కుమార్‌ షిండే మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అస్సాంలోని సిల్చార్‌లో వీవీప్యాట్‌ మొరాయించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దాన్ని బాగుచేసే పనిలోపడ్డారు

దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభంమైన పోలింగ్‌ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్ర 4 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతాబలగాలు మోహరించాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top