
సాక్షి, న్యూఢిల్లీ : అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రెండాకుల గుర్తును పళని-పన్నీర్ వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శశికళ వర్గానికి మరోసారి చుక్కెదురైనట్లయ్యింది.
జయలలిత చనిపోయాక ఆమె సహయకురాలు శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి పదవి కోసం యత్నించటం.. పన్నీర్ సెల్వం తిరుగుబాటు, ఆపై అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లటం.. పళనిసామి ముఖ్యమంత్రి కావటం ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి పన్నీర్ వర్సెస్ పళని వర్సెస్ శశికళ-దినకరన్ వర్గ పోరుతో ఎంట్రీతో అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమయంలో పార్టీ గుర్తు కోసం శశికళ-దినకరన్, పళని, పన్నీర్ వర్గాలు ఈసీని ఆశ్రయించటంతో ఆ సమయంలో గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేశారు.
తర్వాత ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు ఏకం కావటంతో గుర్తు ఎవరికి కేటాయిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై పలు దఫాలుగా విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరకు బుధవారం నిర్వహించిన సమావేశంలో శశికళ వర్గ వాదనను పక్కకు పెట్టి పళని-పన్నీర్ వర్గానికే గుర్తును కేటాయిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.